● జిల్లాలోని 20 ఎంపీపీ, 18 వైస్
ఎంపీపీ పీఠాలన్నీ తమ్ముళ్ల కై వసం
● వైఎస్సార్‌సీపీకి నాలుగు ఎంపీపీ స్థానాలు
● జనసేనకు మొక్కుబడిగా
రెండు వైస్ ఎంపీపీ పదవులతో సరి
● బీజేపీకి దక్కింది గుండుసున్నా.. ఆ
రెండు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసహనం
సాక్షి, మదనపల్లె: ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పదవుల పంపకంలో ఘోర పరాభవం ఎదురైంది. గురువారం జిల్లావ్యాప్తంగా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ జరిగింది. జిల్లాలోని 25 మండలాలకు గాను 24 మండలాల్లో ఎంపీటీసీలతో సమావేశాలు నిర్వహించగా.. అందులో 20 ఎంపీపీ, 18 వైస్ ఎంపీపీ పదవులను టీడీపీ ఒక్కటే తన ఖాతాలో వేసుకుంది. నాలుగు ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కాయి. పొత్తులో ఉండి, ఎన్నికల్లో సహకరించిన జనసేన, బీజేపీలకు కనీసం ఒక్క ఎంపీపీ పదవి కూడా కట్టబెట్టకపోవడం చర్చనీయాంశమైంది.
బీజేపీకి కనీస గుర్తింపు కరువు..
ఎంపీపీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ సభ్యులు కూటమి ధర్మానికి కట్టుబడి టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి వారిని గెలిపించారు. కానీ, పదవుల పంపకం దగ్గరకు వచ్చేసరికి టీడీపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి అన్ని పీఠాలను సొంతం చేసుకున్నారు.
● బీజేపీ పరిస్థితి మరీ దారుణం: బీజేపీని టీడీపీ కనీసం గుర్తించినట్లు కూడా లేదు. ఒక్క ఎంపీపీ ఇవ్వకపోగా, కనీసం ఒక్క వైస్ ఎంపీపీ పదవి కూడా విదల్చలేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా కనీస గౌరవం దక్కకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి.
బలమున్నా జనసేనకు దక్కని ప్రాధాన్యత:
జిల్లాలో చాలాచోట్ల జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయంలో జనసేన ఓట్లు అత్యంత కీలకమయ్యాయి. ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో గత ఎన్నికల్లో అందరూ చూసిందే. అయినప్పటికీ, తమ గెలుపునకు కారణమైన జనసేనకు ఒక్క ఎంపీపీ పదవి కూడా ఇవ్వకుండా, మొక్కుబడిగా పెద్దతిప్పసముద్రం, పుంగనూరు మండలాల వైస్ ఎంపీపీ పదవులు కట్టబెట్టి టీడీపీ చేతులు దులుపుకుందని జనసేన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


