వాల్మీకిపురం: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలను ధైర్యంగా సమష్టిగా ఎదుర్కొని విజయం సాధిద్దామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే చింతలతో సమావేశమై పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోటీలో ఉండాలని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని, బాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో విద్య, వైద్యంతో పాటు రైతుల సంక్షేమం, మహిళా సాధికారతకు జగనన్న అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, నాయకులు అభినయ్ రెడ్డి, చింతల సాయిక్రిష్ణారెడ్డి, నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, శివారెడ్డి, ఇబ్రహిం, షహనాజ్ బేగం పాల్గొన్నారు.
– పార్టీ శ్రేణులకు ఎంిపీ మిథున్ రెడ్డి పిలుపు


