మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చరిత్ర, ఉర్దూ అతిథి అధ్యాపకులు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ లలితాబాయి తెలిపారు. చరిత్ర, ఉర్దూ అధ్యాపకుల పోస్టులకు 55 శాతం మార్కులతో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. నెట్, సెట్, పీహెడీ అర్హత కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉర్దూ అధ్యాపక పోస్టుకు ఉర్దూ మాధ్యమంలోనే పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు బికాం (కంప్యూటర్స్), బిఎస్‌సి(కంప్యూటర్స్) లేదా బిసిఏ పూర్తి చేసి, కనీసం మూడు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు తమ దరఖాస్తులను కాలేజీలో అందజేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుందన్నారు.
రాష్ట్ర స్థాయిలో
ప్రతిభ కనబరచాలి
మదనపల్లె సిటీ: రాష్ట్రస్థాయిలో జరిగే జాతీయ సైన్సు కాంగ్రెస్‌లో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని డీఈఓ సుబ్రమణ్యం, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ అన్నారు. గురువారం డీఈఓ కార్యాలయంలో బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్–26 జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలను అందజేశారు. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లా నుంచి ఎక్కువ ప్రాజెక్టులు ఎంపిక కావాలన్నారు. రాష్ట్ర స్థాయి బాలల జాతీయ కాంగ్రెస్ పోటీలు డిసెంబర్ నెల మొదటి వారంలో నిర్వహించనున్నారన్నారు. కార్యక్రమంలో బాలల జాతీయ సైన్సు కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఎం.భాస్కరన్, సైన్సు అధికారి శ్రీధర్, అకడమిక్ కోఆర్డినేటర్లు పీఎల్‌ఎన్ శాస్త్రి, రిసోర్సుపర్సన్లు ,గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
స్కౌట్స్‌తో క్రమశిక్షణ, దేశభక్తి
మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందించడంతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో స్కౌట్స్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.సుబ్రమణ్యం అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్ మాస్టర్లకు శిక్షణా కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. బాడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్కౌట్స్ అనేది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదని, విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప ఉద్యమమన్నారు. 19వతేదీ నుంచి 25వతేదీ వరకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని స్కౌట్స్ మాస్టర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాము నేర్చుకున్న నైపుణ్యాలను పాఠశాల స్థాయిలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఈఓ పద్మావతి, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, లీడర్ ట్రైనర్లు కమల్‌కన్నన్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా హెడ్ క్వార్టర్స్ కమిషనర్ హర్షవర్ధన్‌రెడ్డి, రిసోర్సు పర్సన్లు మోహన్‌బాబు, ప్రసాద్, మమహ్మద్ ఖాన్, వివిధ పాఠశాలల స్కౌట్ మాస్టర్లు పాల్గొన్నారు.
ఎన్నికల బరిలో
79 మంది అభ్యర్థులు
బి.కొత్తకోట: నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల ఉపసంహరణ గురువారం సాయంత్రం ముగిసింది. మొత్తం 79 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అందులో వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పాగొండ ఖలీల్, టీడీపీ అభ్యర్థి కుడుం శ్రీనివాసులతో పాటు మరో ఏడు మంది పోటీలో ఉన్నారు. 23 వార్డులకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని మొత్తం 70 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


