దీపలక్ష్మి నమోస్తుతే..
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం. సర్వతమోవహందీపేనే సాధ్యతే సర్వమ్ దీపలక్ష్మి నమోస్తుతే. సకల జ్ఞానానికి బ్రహ్మ అధిపతి. దీపం సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరిస్తుంది. ఏ ఇంటిలో దీపాలు సమృద్దిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని వేదాలు చెబుతున్నాయి. లక్ష్మికోట ముందు మొదట దీపాలు వెలిగించి ,మహాలక్ష్మి అష్టోత్తరాలతో పూజించి నివేదిస్తే పుణ్యం లభిస్తుంది.
– ఫణికుమార్ శర్మ, వేదపండితులు, మదనపల్లె
మదనపల్లె సిటీ: జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. కొత్త దుస్తులు, టపాకాయలు, లక్ష్మిపూజకు కావాల్సిన సరంజామ కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా అశ్వయజ అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏటా దీపావళి ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి సోమవారం ఉదయం 11.10 వరకు ఉంటుంది. ఆదివారం పండుగ చేసుకోవడం శ్రేష్టం. ఆదివారం సాయంత్రం 5.24 నుంచి 7.26 వరకు దీపావళి ధనలక్ష్మి పూజ చేయుటకు శుభప్రదంగా ఉంటుంది.
పూజ, వస్త్ర దుకాణాలు కిటకిట
జిల్లా వ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు, బి.కొత్తకోట, వాల్మీకిపురంతో పాటు పలు మండల కేంద్రాలలో దుకాణాలలో జనం కిటకిటలాడుతున్నారు. ప్రత్యేకంగా పండుగ కోసం పూజాసామగ్రి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక వస్త్ర దుకాణాలల్లో సందడి నెలకొంది.
జోరుగా బాణసంచా విక్రయాలు
ఈసారి దీపావళి పండుగ వేళ బాణసంచా దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు టపాసుల కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
పూల ధరలకు రెక్కలు
దీపావళి పండుగను పురస్కరించుకుని పూల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని బెంగుళూరు బస్తాండు, మున్సిపల్ కార్యాలయం, చిత్తూరు బస్టాండు, శ్రీకృష్ణదేవరాయసర్కిల్, నీరుగట్టువారిపల్లె ప్రాంతాల్లో అరటి, మామిడి, బూడిద గుమ్మడికాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పూల ధరలకు రెక్కలొచ్చాయి. మల్లెపూలు కిలో రూ.1000 పలికాయి. దీంతో పాటు బంతి, చామంతి, రోజా పూల ధరలు రెట్టింపయ్యాయి. దుకాణాల్లో పూజల కోసం మట్టి దీపాలు, క్యాండిల్స్, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ దీపాల అమ్మకాలు జోరుగా సాగాయి.


