ఇక రావా..కృష్ణమ్మా? | - | Sakshi
Sakshi News home page

ఇక రావా..కృష్ణమ్మా?

Nov 8 2026 1:01 AM | Updated on Nov 8 2026 1:01 AM

ఇక రావా..కృష్ణమ్మా?

చంద్రబాబు షో ఫ్లాప్‌

సాక్షి, మదనపల్లె: కృష్ణమ్మ కరుణించినా, రాజకీయ కక్షలతో చంద్రబాబు కృష్ణా జలాలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. హంద్రీనీవా ద్వారా చివరి ఎకరా వరకు నీటిని అందించామని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు చేసిన షో ఫ్లాప్‌ అయింది. కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చి ఆయన చేసిన ప్రసంగం విన్న జనం అన్ని ప్రాంతాలకు సమానంగా కృష్ణమ్మను తరలిస్తారని ఆశించిన ప్రజలకు, రైతాంగానికి నిరాశే మిగిల్చారు. కృష్ణా జలాల తరలింపు డ్రామా ముచ్చట 37 రోజులకే ముగిసింది. ఒక్క ఎకరా భూమికి సాగు నీరు ఇవ్వని చంద్రబాబు, కనీసం ప్రజల తాగునీటి అవసరాల కై నా ఇవ్వకుండానే కృష్ణాజలాల తరలింపును నిలిపివేశారు. చెర్లోపల్లి రిజర్వాయర్లో నిండుగా నీళ్లున్నా విడుదల నిలిపివేశారు. కనీసం కరువు ప్రాంతాల పరిస్థితిని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

37 రోజులకే ఆపేశారు

సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ సాయంత్రం కృష్ణా జలాలను పుంగనూరు ఉప కాలువకు విడుదల చేశారు. ఈ కాలువ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగుతుంది. అన్నమయ్య జిల్లా సరిహద్దు కిలో మీటర్‌ 75 నుంచి 224.5 కిలోమీటర్‌ వరకు పుంగనూరు ఉపకాలువ, ఇక్కడి నుంచి కుప్పంలోని పరమసముద్రం వరకు కుప్పం ఉప కాలువ 123 కిలోమీటర్లు సాగుతుంది. సెప్టెంబర్‌ 19న కృష్ణా జలాలు విడుదల చేయగా వాటిని నేరుగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి తరలించారు. 37 రోజుల పాటు తరలించిన జలాలను గత నెల (అక్టోబర్‌) 25న చెర్లోపల్లి నుంచి అధికారికంగా విడుదల నిలిపివేశారు.

తరలించింది ఒక టీఎంసీనే

చంద్రబాబు..శ్రీశైలం నుంచి కుప్పానికి నీటిని అందించామని గొప్పగా చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పానికి తొలిసారిగా జలాలను తరలించారు. ఈ విషయాన్ని చంద్రబాబు పక్కన పెట్టి తానే ఇచ్చారని చెప్పుకున్నారు. 37 రోజులు తరలించిన నీటీలో సింహభాగం కుప్పానికే వినియోగించుకున్నారు. 1.1 టీఎంసీ నీటిని మాత్రమే కాలువలోకి విడుదల చేశారు. ఈ నీటితో కుప్పం నియోజకవర్గంలోని సుమారు 50 చెరువులకు నీళ్లు ఇచ్చుకున్నారు. మదనపల్లెలో ఏడు చిన్న చెరువులకు నీటిని మళ్లించుకున్నారు. చెప్పిన ట్యాంకుకు కొద్దిపాటి నీటిని తరలించారు. అంతటితోనే జలాలను నిలిపివేశారు.

పుంగనూరు, తంబళ్లపల్లెకు తీరని ద్రోహం

జలాల విషయంలో చంద్రబాబు తీవ్రమైన వివక్ష చూపించారు. కరువుతో అల్లాడిపోతున్న తంబళ్లపల్లె, తాగునీటి కోసం అలమటిస్తున్న పుంగనూరుకు కృష్ణా జలాలు ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు కనికరించలేదు. ఎల్‌ నినో ప్రభావం తీవ్రంగా ఉందని పదే పదే చెప్పే ఆయన ఈ ప్రాంతాలపై రాజకీయ కక్ష పెంచుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల మీదగా పుంగనూరు ఉప కాలువ సాగుతున్నప్పటికీ..కాలువ నుంచి చుక్క నీటిని మళ్లించలేదు. రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి రాజకీయ కక్షతో పుంగనూరు ప్రజలను శిక్షించవద్దని పదేపదే విన్నవించారు. ఎస్‌ ఎస్‌ ట్యాంకులకు, చెరువులకు నీళ్లు ఇవ్వలేదని వాటిని పరిశీలించి, పరిస్థితులను వివరించారు. అయినప్పటికి చంద్రబాబు కుప్పం ప్రయోజనాలకే పెద్ద పీట వేశారు. విధంగా నీటి సమస్యతో పుంగనూరు అల్లాడిపోతోంది.

ఎకరా తడవలేదు

హంద్రీనీవా ద్వారా చివరి ఎకరాకు నీరు ఇచ్చామని చెప్పిన చంద్రబాబు, వాస్తవానికి కాలువ దాటి పొలంలోకి చుక్క నీరు చేరలేదు. వాస్తవానికి హంద్రీనీవా సాగు, తాగునీటి ప్రాజెక్టు. పుంగనూరు, కుప్పం కాలువల కింద పెద్దతిప్పసముద్రం మండలంలో 4,685 ఎకరాల ఆయకట్టు, బి.కొత్తకోటలో 6,900 ఎకరాలు, ములకలచెరువులో 9,565, కురబలకోటలో 5వేలు, మదనపల్లిలో 5,400, పుంగనూరులో 5,100, పెద్దపంజాణిలో 4,200, గంగవరంలో 2,300, పలమనేరులో 1,900, కుప్పంలో 10వేల కలుపుకొని, మొత్తం 55,050 ఎకరాలకు సాగునీరు అందించాలి. అయితే ఒక ఎకరా కాదు కదా సెంటు భూమికి కూడా నీరు అందించలేదు.

ఎన్నికల స్టంటా

మున్సిపల్‌, స్థానిక ఎన్నికల కోసం చంద్రబాబు కృష్ణా జలాల నాటకం ఆడినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. చెర్లపల్లి జలాశయంలో ప్రస్తుతానికి ఒక టీఎంసీకి మించిన నీళ్లు నిల్వ ఉన్నాయి. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి ఇప్పటికీ 300 క్యూసెక్కుల నీళ్లు చెర్లోపల్లికి వస్తున్నాయి. అయినప్పటికీ అన్నమయ్య జిల్లాకు నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఇవ్వకుండా నీటి విడుదల ఆపేశారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు పాటు నీటిని తరలించినట్టు ప్రజల్లో, రైతుల్లో భ్రమలు కల్పించి రాజకీయ లబ్ధి కోసమే నీటి విడుదల హడావుడి చేసినట్టు ప్రజలు విమర్శిస్తున్నారు. వాస్తవంగా నీళ్లపై రాజకీయం లేకుంటే తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వలేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కక్షలకు నీటిని అస్త్రంగా వాడుకుంటారా అని నిలదీస్తున్నారు.

ఉమ్మడి జిల్లాకు తరలించింది ఒక టీఎంసీ నీళ్లే

కుప్పానికి తరలించుకుని గొప్పలు

తంబళ్లపల్లె, పుంగనూరుకు తీరని ద్రోహం

25వ తేదీనే కృష్ణా జలాల విడుదల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement