జమ్మలమడుగు రూరల్: భార్య సీమంతం వేడుకల వేళ ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. బంధువుల కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన జమ్మలమడుగు మండల పరిధిలోని ధర్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి అన్న శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... ధర్మాపురం గ్రామానికి చెందిన శ్రీధర్ (22) భార్య సీమంతం వేడుకలు శనివారం ఇంట్లో జరుగుతున్నాయి. వేడుకకు వచ్చిన బంధువుల కోసం తాగునీరు తెచ్చేందుకు శ్రీధర్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అతడిని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రీధర్ మృతి చెందాడు. డిగ్రీ వరకు చదివిన శ్రీధర్, ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పొలం పనులు చేసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి అన్న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: కడప జిల్లాలోని బియ్యం వ్యాపారుల దోపిడీపై చర్యలు తీసుకువాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. యం.ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌లో డీఆర్వో మల్లికార్జునుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం రూ.1400 ఉన్న 25 కేజీల బియ్యం బస్తా ధరను ప్రస్తుతం రూ.2500 నుంచి రూ.3500 వరకు పెంచి సామాన్యులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే చౌక బియ్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధరలను అరికట్టి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, జనతాదళ్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎం ప్రతాప్ రెడ్డి, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు, ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ హిందూ మహాసభ ప్రతినిధులు గున్న జయరాం, ఎస్వీ రమణ, జెసీఐపీ నగర కార్యదర్శి ఎరుకల మల్లయ్య, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మధుసూదనాచారి, నాయకులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు : మైదుకూరు శివారులో కేసీ కాలువ కల్వర్టు కింద పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్ ఫిరోజ్(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరోజ్ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. మోటార్ బైక్‌పై బద్వేలు రోడ్డులోని అరుంధతి నగర్ వద్ద నుంచి కేసీ కాలువ కట్టపై వెళుతున్నట్టు తాము చూశామని తెలిసిన వారు చెప్పడంతో కట్టపైన వెతికారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో శనివారం ఉదయం అదే ప్రాంతంలో మళ్లీ వెతకగా శివపురం సమీపంలో కాలువ తూము కింద నిలువ ఉన్న నీటిలో ఫిరోజ్ శవమై కనిపించాడు. సంఘటన గురించి తెలియడంతో అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తూము నుంచి బయటకు తీయించారు. ముఖంపై, తలపై గాయాలు ఉండటంతో మద్యం మత్తులో బైక్‌తో సహా కల్వర్టుపై నుంచి కింద పడటం వల్ల తగిలిన దెబ్బలా లేకా ఎవరైనా చంపి అక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ముద్దనూరు: ముద్దనూరు–కడప రహదారిలో కొత్తపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకునికి తీవ్రగాయాలయ్యాయి. బైక్‌లో శనివారం ముద్దనూరుకు ప్రయాణిస్తున్న నాయక్,వేణులను గుర్తుతెలియని వాహనం ఢీకొంది.ఈ ప్రమాదంలో వేణు తలకు తీవ్రగాయమైంది.క్షతగాత్రున్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.


