చౌడేపల్లె: మండలంలోని చిన్నకొండామర్రి సమీపంలో గల పశువుల దిన్నె వద్ద నూతనంగా నిర్మించిన శివాలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు ధ్వంసం చేసి లోపలికి చొరబడిన దొంగలు దొరికినంత దోచుకున్నారు. శనివారం ఉదయం నిత్య పూజల నిమిత్తం ఆలయానికి వచ్చిన అర్చకుడు.. ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆయన గ్రామస్తులకు, ఆలయ కమిటీ నిర్వాహకులకు సమాచారం అందించారు.
ఆలయంలోకి చొరబడిన దుండగులు అక్కడ ఉన్న బీరువాను పగులగొట్టి అందులోని వెండి నగలను అపహరించారు. అనంతరం భక్తులు సమర్పించిన హుండీ తాళాలు పగులగొట్టి, అందులో ఉన్న సుమారు రూ. 30 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో తమ దొంగతనం రికార్డు అవుతుందని గ్రహించిన దుండగులు పక్కా స్కెచ్‌తో వ్యవహరించారు. కెమెరాలకు సంబంధించిన వైర్లను కత్తిరించి, వాటిని ధ్వంసం చేయడమే కాకుండా.. లోపల ఉన్న సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ చోరీ వెనుక స్థానికుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
– తాళాలు పగులగొట్టి నగదు, వెండి నగలు అపహరణ
– చౌడేపల్లె మండలం చిన్నకొండామర్రి వద్ద ఘటన


