రంగస్థలంపై ‘సహస్ర’ అభినయం | - | Sakshi
Sakshi News home page

రంగస్థలంపై ‘సహస్ర’ అభినయం

Nov 7 2026 1:48 AM | Updated on Nov 7 2026 1:48 AM

● రవిచంద్రారెడ్డి ప్రస్థానంలో వేయి నాటకాల మైలురాయి

● చింతామణి తల్లి పాత్రలో రాణింపు

ఎర్రగుంట్ల : రంగస్థలంపై తెర లేచిన ప్రతిసారీ అభినయ ముద్ర వేస్తూ, వేయి ప్రదర్శనల అరుదైన మైలురాయిని అధిగమించడం సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు వృత్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు కళామతల్లి సేవలో తరిస్తూ, నాటకరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించారు నిమ్మకాయల రవిచంద్రారెడ్డి. చిన్నతనంలో చిగురించిన నటనాభిలాషను నిరంతర సాధనతో ప్రవృత్తిగా మలచుకుని, వెయ్యి నాటకాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆయన ప్రయాణం నేటి తరానికి ఆదర్శనీయం. కళాక్షేత్రంలో ఆయన అలుపెరగని అభినయ విన్యాసం, అందుకున్న ఘన సన్మానం రంగస్థల వైభవానికి దక్కిన గౌరవం.

చిరు ప్రాయంలోనే ఆసక్తి

కమలాపురం మండలం సి.రాజుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి, సరస్వతమ్మ దంపతుల ప్రథమ సంతానమైన రవిచంద్రారెడ్డిలో చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెరిగింది. ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లోనే స్వగ్రామంలో ‘జీరోలైన హీరోలు’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేశారు. ఆ తర్వాత పాయసంపల్లిలో చదువుకునే రోజుల్లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ‘ప్రెసిడెంట్‌ పెంటయ్య’ నాటకంలో నటించి తనలోని వైవిధ్యమైన నటనను చాటుకున్నారు.

వృత్తితోపాటు ప్రవృత్తిగా కళాసేవ

ప్రస్తుతం ఎర్రగుంట్ల మండల పరిధిలోని డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడే నివాసముంటున్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూనే, నాటకరంగాన్ని శ్వాసగా మార్చుకుని నిరంతర ప్రదర్శనలతో రాణిస్తున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ ‘చింతామణి’ నాటకంలో తల్లి (శ్రీహరి) పాత్రలో ఆయన పండించే హావభావాలు, అభినయం ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఇలా ఏకంగా 1000 నాటక ప్రదర్శనలు పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు.

అత్యున్నత వేదికపై ఘన సన్మానం

ఈ అరుదైన మైలురాయి రవిచంద్రారెడ్డి గారి రంగస్థల ప్రయాణంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీ గణేష్‌ కళానికేతన్‌ 30వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన నాటక ప్రదర్శనలో ఆయన తన అద్భుత నటన ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతోనే ఆయన విజయవంతంగా 1000 నాటకాల మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ చారిత్రాత్మక సందర్భంగా అదే వేదికపై నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. నాటకరంగాన్ని లాభాపేక్ష లేని ప్రవృత్తిగా మలచుకుని, కళాసేవలో తరిస్తున్న ఆయనను పలువురు ప్రముఖులు, కళాభిమానులు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement