● వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అల్లుడిని కొట్టిన పోలీసులు
● ఖాకీల తీరుపై విమర్శల వెల్లువ
కురబలకోట : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అంగళ్లులో పోలీసులు జనాల్ని చెదరగొట్టిన సందర్భంలో.. లాఠీ దెబ్బలు తిన్న మండలంలోని చిన్నతట్టివారిపల్లికి చెందిన సునీల్ కోలుకుంటున్నారు. గురువారం అంగళ్లులో పోలింగ్ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రెడ్డికుమారితోపాటు ఇతను పోలీసుల తీరును నిరసించిన విషయం తెలిసిందే. రెడ్డికుమారికి స్వయానా అల్లుడి తమ్ముడైన ఇతని చేయి ఎముక ప్రాక్చర్ కావడంతో వైద్యులు చేతికి కట్టుకట్టారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అంగళ్లు వన్ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రెడ్డికుమారికి మద్దతుగా వెళ్లిన ఇతనికి పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బకు కుడి చెయ్యి ప్రాక్చర్ అయ్యింది. ఈ ఘటనలో పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు సరికాదన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో సంయమనం పాటించాల్సి ఉన్నా.. లాఠీలకు పని చెప్పడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయాల పాలయ్యేలా పోలీసులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
– తండ్రి, కుమార్తైపె హత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ఇంటి ముందున్న నీటి కుళాయి వద్ద పేడ దిబ్బ విషయమై జరిగిన వివాదం తండ్రి, కుమార్తైపె హత్యాయత్నానికి దారితీసిన ఘటన ములకలచెరువు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ములకలచెరువు మండలం సోంపల్లి పంచాయతీ ఏడుమడకలపల్లె గ్రామానికి చెందిన కృష్ణప్ప(75), ఆయన కుమార్తె రమాదేవి(35)పై అదే గ్రామానికి చెందిన రామాంజులు, రాఘవ దాడికి పాల్పడ్డారు. నీటి కుళాయి వద్ద ఉన్న పేడ దిబ్బ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. మాటకుమాట పెరగడంతో ఆగ్రహానికి గురైన రామాంజులు, రాఘవ తమ ప్రత్యర్థులు అయిన కృష్ణప్ప, అతని కుమార్తె రమాదేవిపై దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘర్షణలో గాయపడిన కష్ణప్ప, అతని కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


