మదనపల్లె టౌన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లె పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. ఆర్‌ఐ వెల్ఫేర్ ఎం.రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి పిల్లలు, పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర సమకాలీన అంశాలపై వ్యాసరచన, వక్తత్వం, డిబేట్, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను విద్యార్థులు స్మరించుకోవాలని, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు ఎ.శ్రీనివాస్, జి.రవి, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


