సాక్షి, మదనపల్లె : జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్లు, వాటి ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నం ముగియడంతో పోటీలో అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా వీటికి పోటీ చేసేందుకు 277 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీటి పరిశీలన తర్వాత 189 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించబడ్డాయి. వీటి ఉపసంహరణ తర్వాత 91 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీటిలో మూడు జెడ్పీటీసీలు లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి ఏకగ్రీవం అయ్యాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టేశారు. జిల్లాలో 321 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటికి 1,449 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలించిన తర్వాత 1,141 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. ఉపసంహరణ తర్వాత 392 మంది పోటీలో నిలిచారు. వీటిలో 169 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 152 ఎంపీటీసీ స్థానాలకు 392 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో ప్రధానంగా బీజేపీ ఏడు, సీపీఐ 5, కాంగ్రెస్ ఒకటి, జనసేన 23, టీడీపీ 140, వైఎస్సార్‌సీపీ 139, ఇతర పార్టీలు నాలుగు, స్వతంత్రులు 73 మంది పోటీ చేస్తున్నారు.
15 మండలాలు ఏకగ్రీవం
చిన్నమండెం, చౌడేపల్లి, కెవి.పల్లి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి, సంబేపల్లి మండలాల ఎంపీటీసీలు మొత్తం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఎనిమిది మండలాలైన వాయల్పాడు, సోమల, పీలేరు, ములకలచెరువు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, గాలివీడు లో ఒకటి నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ ఉన్నప్పటికీ ఈ స్థానాలతో ఎంపీపీ ఎన్నికకు అవసరం లేదు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావడంతో మంగళవారం సాయంత్రం నుంచే అభ్యర్థులు తమ ప్రచారాలకు పదును పెట్టారు. పల్లెల్లో తిరుగుతూ తమను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీల నేతలు ఆయా పార్టీల కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.
22 జెడ్పీటీసీ, 152 ఎంపీటీసీ
పదవులకు పోటీ
జెడ్పీటీసీలకు 91 మంది, ఎంపీటీసీలకు 392 మంది పోటీ
3 జెడ్పీటీసీలు, 15 మండలాలు ఏకగ్రీవం
ప్రచార రంగంలోకి దిగిన అభ్యర్థులు


