● ఆసుపత్రి సిబ్బంది క్వార్టర్స్ స్థలంపై కన్ను
● అనుమతి లేకుండానే చదును
● కూటమి నేతల మద్దతుతో కబ్జా
కలకడ : కలకడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది క్వార్టర్స్ స్థలం ఆక్రమణ.. కూటమి నేతల మద్దతుతో జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని 30 ఏళ్ల కిత్రం క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. అయినా వాటిలో సిబ్బంది చేరకపోవడంతో వృథాగా ఉండి శిథిలావస్థకు చేరాయి. సిబ్బంది కానీ, వైద్యులు గానీ అటువైపు చూడకపోవడంతో కూటమి నేతల కన్ను అక్కడి ఖాళీ స్థలంపై పడింది. చిన్న కార్యకర్తలను పంపి జేసీబీతో ముళ్లపొదలను తొలగించి, చదును చేశారు. ప్రభుత్వ ధనం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు ఎందుకు ఈ విధంగా వృథా అవుతున్నాయని పరిశీలించిన అధికారి లేరు. నేడు కలకడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో ప్రైవేటు వ్యక్తులు పాగా వేయడానికి సిద్ధమయ్యారు. విధులలో ఉన్న డాక్టర్ మోహన్ ఎందుకు ఆక్రమణ చేస్తున్నారు అని కోరినా.. సమాధానం చెప్పకుండా చదును చేస్తే.. నీకేంటి అంటూ ఎదురు తిరిగినట్లు తెలిపారు. నిర్లక్ష్య సమాధానంపై ఫిర్యాదులు తప్పవు అని సోమవారం హెచ్చరించినా, తిరిగి మంగళవారం ఆక్రమణకు యత్నం చేసినట్లు తెలిపారు. దీంతో కన్ను పడితే కబ్జా జరిగిపోవాల్సిందే అన్నట్లు అనేక మార్లు.. సిబ్బంది లేని సమయంలో ఆక్రమణదారులు చొరబడి ఆక్రమిస్తున్నట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి క్వార్టర్స్‌ను పూర్తిగా ఆక్రమించడానికి బడా నాయకులు కన్ను వేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రి వరకూ ఉన్న కాలువను పూర్తిగా ఆక్రమించి కాలువపై నిర్మాణాలు కూడా చేపట్టారు. కాలువలు, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.


