● వార్డుల్లో నిసార్ అహ్మద్,
తిప్పారెడ్డి విస్త్రృత ప్రచారం
సాక్షి, మదనపల్లె : వైఎస్సార్‌సీపీ విజయంతోనే మదనపల్లె మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి అన్నారు. ఆదివారం వారు వేర్వేరుగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చలపతి, వార్డు అభ్యర్థులతో కలిసి విస్త్రృత ప్రచారం నిర్వహించారు. నవంబర్ ఒకటిన జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. జగనన్న పాలనలో, ఐదేళ్ల కౌన్సిల్ పాలనలో పట్టణంలో అభివృద్ధి చేశామని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. కూటమి పాలన వచ్చాక పట్టణంలో ప్రజలకు కనీసం తాగునీటిని ఇవ్వలేదని దుస్థితి నెలకొందని అన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిల్ పాలనలో నీటి సమస్యలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. 12, 26, 27 వార్డుల్లో అభ్యర్థులు నవాజ్ అలీఖాన్, థఫిక్, ఖాజా హుసేన్‌లతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంతరం నిసార్ అహ్మద్, జింకా చలపతి సీఎస్‌ఐ, ఇమ్యాన్యుయేల్, పెంతెకోస్ట్ చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొనగా పాస్టర్లు ఆశీర్వాదం అందించారు. క్రైస్తవులను కలుసుకుని వారి మద్దతు కోరారు.
వార్డుల్లో విస్త్రృత ప్రచారం:
మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పార్టీ తరఫున ఖరారైన అభ్యర్థులు తమ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్లలో జగనన్న పాలనలో చేపట్టిన అభివృద్ధి, గత మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వైస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మనూజ, పార్టీ నేతలు, కార్యకర్తలు వెంట ఉండి ప్రచారంలో పాల్గొంటున్నారు.


