మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు బయలుదేరుతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
● ముగ్గురు నిందితుల అరెస్ట్
మదనపల్లె టౌన్ : ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర నుంచి కర్ణాటకకు ఏపీ మద్యం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. తాలూకా సీఐ మహమ్మద్ రఫీ ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం నక్కలదిన్నె తండాకు చెందిన మూడే కృష్ణా నాయక్ (57), చీకలబైలు గ్రామానికి చెందిన చంద్రశేఖర్(40), మంజునాథ్(35) కలిసి మొత్తం 147 మద్యం బాటిళ్లు కర్ణాటకకు తరలిస్తుండగా.. చీకలబైలు సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారి ముగ్గురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని సీఐ తెలిపారు.
పుంగనూరు : అత్తమామల వేధింపులతో కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కుమ్మరగుంటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుమ్మరగుంటకు చెందిన నరసింహులు భార్య సుష్మ(29)ను తరచు అత్తమామ లు వేధిస్తుండటంతో ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాల్మీకిపురం : స్థానిక పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న బాబా ప్రసాద్ పట్టణంలోని నాయక్‌వీధి రైల్వేగేటు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి బాబా ప్రసాద్ ఇంట్లో చోరీకి యత్నించే క్రమంలో.. అక్కడ ఉన్న రూ.20 వేల విలువ చేసే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో హోంగార్డు ఇంట్లో నిద్రిస్తుండగా శబ్దాలు రావడంతో పక్కంటి వారికి సమాచారం అందించడంతోపాటు లేచి బయటకు వచ్చి ఇంటి ముందు లైట్లను ఆన్ చేశాడు. అదే సమయంలో పక్కంటి వారు కూడా లైట్లను ఆన్ చేయడంతో అక్కడి నుంచి దుండగులు పరుగులు తీసి పరారయ్యారు. ఇదే వీధిలో రెండు వారాల క్రితం దొంగతనం జరిగింది. నెల క్రితం చింతపర్తిలో సైతం ఒకే రాత్రి రెండు దొంగతనాలు జరిగాయి. ఇక్కడ పాల్పడిన ముగ్గురు దుండగులే వరుస చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోందని హోంగార్డు అంటున్నాడు. బాధితుడు స్థానిక ఎస్సై తిప్పేస్వామికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


