రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. కొందరు అమ్మవారికి బంగారు, వెండి, చీరె సారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం.

ఆలయానికి విరాళం

శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మాచనూరు గ్రామానికి చెందిన కె.నిత్యానందరెడ్డి రూ.25 వేలు విరాళంగా అందించారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాత ఆలయ ఈవో మంజులకు రూ. 25 వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దాతల పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి శేషవస్త్రంతో దాతలను సత్కరించారు. దాతలు అందజేసిన విరాళాన్ని వాల్మీకిపురం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకులో జమ చేయనున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఆలయ చైర్మన్‌ లంకిపల్లి రాజన్ననాయుడు, ఈవో మంజుల ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement