●నేడు ఇన్‌ఛార్జి మంత్రి రాక.. బుజ్జగింపులు శాంతించేనా? | - | Sakshi
Sakshi News home page

●నేడు ఇన్‌ఛార్జి మంత్రి రాక.. బుజ్జగింపులు శాంతించేనా?

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

●నేడు ఇన్‌ఛార్జి మంత్రి రాక.. బుజ్జగింపులు శాంతించేనా?

● మదనపల్లె సీఎం సభ ముంగిట

‘వైరల్‌’ రాజకీయం!

● ఎమ్మెల్యే భేటీకి ‘మండలాల’ అధ్యక్షులు, సీనియర్ల డుమ్మా..

నివ్వెరపోయిన యంత్రాంగం

● పార్టీ పనులకేనా మా అవసరం?.. మాజీ ఎమ్మెల్యేలకూ తప్పని అవమానం!

● తెలుగు యువత శ్రీరామ్‌ చినబాబు మొదటి నుంచీ దూరమే

● జన సమీకరణ దెబ్బతినకుండా

నేడు ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి బుజ్జగింపుల ‘పంచాయితీ’!

సాక్షి, మదనపల్లె: అక్టోబర్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లు మదనపల్లె పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడి తెలుగుదేశం పార్టీలో చెలరేగిన ‘అంతర్గత తిరుగుబాటు’ ఒక్కసారిగా నియోజకవర్గ రాజకీయాల్లో పెను కలకలం రేపింది. సభ ముంగిట తమ్ముళ్లు అసమ్మతి రాగం ఎత్తుకోవడంతో పార్టీ అధిష్టానం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శుక్రవారం జరగబోయే సీఎం భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేయడం కోసం సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఈ అధికారిక సమావేశానికి పార్టీ సాధారణ శ్రేణులు, ఎమ్మెల్యే అనుచరులు హాజరైనప్పటికీ.. నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన ముఖ్య నేతలు, పాత తరం తమ్ముళ్లు మాత్రం మొహం చాటేశారు.

‘కూలీలం’ మేం.. పదవులు మీకా?

‘పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండాలు మోయడానికి, సభలకు జనాలను తరలించే పనులకేనా మా అవసరం? తీరా అధికారంలోకి వచ్చాక మా అవసరం తీరిపోయిందా? ఇప్పుడు మళ్లీ సీఎం వస్తున్నారని మా అవసరం ఏర్పడిందా?’ అని పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా కనీస గౌరవం లేదని, మండలాల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వీరు ఎప్పటినుంచో అధిష్టానం వద్ద, మంత్రుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నా కనీస స్పందన కరువైంది. దీంతో సీఎం సభ విషయంలో కష్టపడి పనిచేసినా ఇదే పరిస్థితి ఉంటుందని, కేవలం సాధారణ కార్యకర్తల్లా సభకు వెళితే చాలన్న నిరాశలో ముఖ్య నాయకులు ఉన్నారు.

ఎమ్మెల్యే సమావేశానికి ముఖ్య నేతల డుమ్మా!

ఎమ్మెల్యే నిర్వహించిన ఈ కీలక జన సమీకరణ భేటీకి మదనపల్లె పట్టణ అధ్యక్షుడు అరుణ్‌ తేజ్‌, రామసముద్రం మండల అధ్యక్షుడు విజయ్‌గౌడ్‌, మదనపల్లె మండల అధ్యక్షుడు శ్రీనివాసులు హాజరు కాకపోవడం గమనార్హం. వీరితో పాటు ఉర్దూ అకాడమీ వైస్‌ చైర్మన్‌ పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాసులు మరియు మరికొందరు ముఖ్య నాయకులు సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించారు. దీంతో సోమవారం రాత్రి నుంచే అసమ్మతి నేతలకు పార్టీ అగ్రశ్రేణి నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. సీఎం సభ విషయంలో ఇలా దూరంగా ఉండడం సుమచితం కాదని, జన సమీకరణలో సహకరించాలని బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు.

మాజీ ఎమ్మెల్యేలూ దూరమే..

రగిలిపోతున్న చినబాబు వర్గం!

మదనపల్లెలో టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు, నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు ఉన్నప్పటికీ.. సీఎం సభ హడావుడి ఈ వర్గాల్లో కనీసం కనిపించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటంటే ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు వీరే స్వయంగా దూరమయ్యారా లేక స్థానిక ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం అందడం లేదా అన్నది పార్టీ వర్గాల్లోనే పెద్ద చర్చగా మారింది. ఇక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ఉండడంతో, ఆయన మొదటి నుంచి సభకు, పార్టీ పనులకు పూర్తి దూరంగానే ఉంటున్నారు.

సీఎం సభ ముంగిట పార్టీలోని ఈ దారుణ పరిస్థితుల నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి బుధవారం అత్యవసరంగా మదనపల్లెకు వస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతలంతా సభ వ్యవహారాలకు, పార్టీ పనులకు దూరంగా ఉండటంతో అక్టోబర్‌ 2 నాటి సభకు జన సమీకరణపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అధిష్టానం గ్రహించింది. దీంతో జన సమీకరణ దెబ్బతినకుండా ఉండేందుకు మంత్రి గారి ఆధ్వర్యంలో బుజ్జగింపుల ‘హాట్‌’ పంచాయితీ మొదలైనట్లు తెలుస్తోంది. మరి ఈ బుజ్జగింపులతో మదనపల్లె తమ్ముళ్లు శాంతిస్తారా? లేక సీఎం సభ వేదికగా తమ అసంతృప్తి ఘాటును చూపిస్తారా? అనేది ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement