మూడేళ్లకే | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లకే

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

మూడేళ్లకే

● చిన్నారి ‘భవనీత్‌’ బతుకు పోరాటం

● ఆపన్న హస్తం కోసం

ఆటో డ్రైవర్‌ కుటుంబం కన్నీటి ఆవేదన

● అప్లాస్టిక్‌ అనీమియాకు తోడుగా

సపోర్టివ్‌ డయాలసిస్‌

● పసిప్రాణానికి తప్పని నరకయాతన

● తిరుపతి, బెంగళూరు, చైన్నె తిరిగినా

లభించని ఊరట

● బోన్‌ మ్యారోకు రూ.30 లక్షలు అవసరం

‘ఆ పసివాడికి ఇంకా అమ్మ కడుపు చలవ కూడా పూర్తిగా తీరలేదు.. కనీసం ఆటపాటల వయసు కూడా రాలేదు.. అప్పుడే నూరేళ్ల ఆయుష్షును వెక్కిరిస్తూ మృత్యువు ముంగిట నిలబడ్డాడు. ఆ పసి గుండె కొట్టుకోవాలన్నా, ఆ నిష్కల్మషమైన కళ్లల్లో మళ్లీ నవ్వులు పూయాలన్నా.. అద్దె ఆటో నడిపే ఆ పేద తండ్రికి ‘రూ.30 లక్షల’ అక్షరాల కొండను దాటడం కత్తిమీద సాములా మారింది. రోజురోజుకూ క్షీణిస్తున్న కన్నబిడ్డ ప్రాణాన్ని చూస్తూ.. ‘మా ప్రాణాలు తీసైనా నా కొడుకును బతికించండి బాబూ’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న హృదయ విదారక గాథ ఇది...’

గాలివీడు: ఆ పసివాడికి మూడేళ్లు నిండనే లేదు. అప్పుడే మృత్యువుతో పోరాటం మొదలైంది. ఆటపాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన మూడేళ్ల చిన్నారి, నేడు ప్రాణాంతక వ్యాధితో ఆసుపత్రి మంచంపై కొట్టుమిట్టాడుతున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ పసిప్రాణాన్ని దక్కించుకోవడానికి రూ.30 లక్షల భారీ బడ్జెట్‌ కొండలా మారిపోవడంతో, ఆ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

మూడు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ..

గాలివీడు మండలం నూలివీడు గ్రామం కొత్తపల్లి హరిజనవాడకు చెందిన వీరబల్లి వెంకటరమణ ఒక అద్దె ఆటో నడుపుకుంటూ రోజువారీ వచ్చే అరకొర ఆదాయంతో తన భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా పోషించుకుంటున్నాడు. అయితే, మూడు నెలల క్రితం వీరి చిన్న కుమారుడు భవనీత్‌ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. చిన్నారికి వైద్యం కోసం కన్నతల్లిదండ్రులు తిరుపతి, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాల్లోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అక్కడ జరిగిన తాజా వైద్య పరీక్షల్లో చిన్నారి భవనీత్‌ ‘అప్లాస్టిక్‌ అనీమియా’ (తీవ్ర రక్తహీనత, బోన్‌ మ్యారో సమస్య) అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి తోడు ప్రస్తుతం ఆ పసివాడికి సపోర్టివ్‌ డయాలసిస్‌ కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రెక్కాడితే గాని డొక్కాడని బతుకు..

రూ.30 లక్షలు ఎక్కడివి?

చిన్నారి భవనీత్‌కు అత్యవసరంగా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయిస్తేనే ప్రాణాలు దక్కుతాయని, అందుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. అద్దె ఆటో నడిపితేనే పూట గడవని ఆ నిరుపేద కుటుంబానికి రూ.30 లక్షలు అనేది ఊహకందని అంకె. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చడం అస్సలు సాధ్యం కావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కొద్దిపాటి సొమ్ము, అప్పులు తెచ్చి వైద్యానికి ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజురోజుకూ క్షీణిస్తున్న కొడుకు ఆరోగ్యాన్ని చూసి, ‘అయ్యా.. ఏ పుణ్యాత్ముడైనా స్పందించి మా బిడ్డను కాపాడండి.. మీ రుణం తీర్చుకుంటాం’ అంటూ తండ్రి వెంకటరమణ, కన్నతల్లి శ్రీదేవి రెండు చేతులు జోడించి కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. దాతలు మానవతా దృక్పథంతో స్పందించి ఈ నిరుపేద ఆటో డ్రైవర్‌ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నారి భవనీత్‌ వైద్య చికిత్సకు సహాయం చేయదలచిన దాతలు మానవత్వంతో స్పందించి తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని కింది నంబర్‌ ద్వారా అందించవచ్చు.

తండ్రి పేరు: వీరబల్లి వెంకటరమణ

గూగుల్‌పే / ఫోన్‌పే నంబర్‌: 7997510574

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement