మదనపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కోసం చేపట్టిన హంద్రీనీవా రెండో దశ కుప్పం ఉపకాలువ పనుల్లో దోపిడీ పర్వం నిస్సిగ్గుగా కొనసాగుతోంది. కాలువ పనుల్లో చంద్రబాబు సన్నిహితుడు, ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన ‘రుత్విక్ ప్రాజెక్ట్స్’ సంస్థకు అడ్డగోలుగా దోచిపెట్టేందుకు ’అదనపు పనులు – అంచనాల పెంపు’ పేరుతో ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసేసింది. కాలువ లైనింగ్ పనుల విషయంలో అంచనాలు పెంచుకుని దోచుకునేందుకు పథకం సిద్ధమైందంటూ గత డిసెంబర్ 6న ‘సాక్షి’లో ప్రచురితమైన ’కుప్పం కాలువలో అ..ధనం’ కథనం ఇప్పుడు అక్షరాలా నిజమైంది.
నిబంధనలు మార్చి..
రూ.40.79 కోట్లు అదనం
గత ఏడాది కుప్పం ఉపకాలువకు లైనింగ్ పనులు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. పలమనేరు, కుప్పం నియోజకవర్గంలో సాగే ఈ కాలువలో లైనింగ్ పనుల కోసం 143 కిలోమీటర్ల కాలువను రెండు రీచులుగా విభజించగా.. మొదటి రీచ్ పనులను రుత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ రూ.85.46 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు షార్ట్ క్రీటింగ్ స్థానంలో ’ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ’ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఇష్టమొచ్చినట్లు పనులు చేసుకునే అవకాశాన్ని కల్పించి, కాలువ నాణ్యత దెబ్బతిన్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. అధికారులు సమర్పించిన అనుకూల నివేదికతో ప్రభుత్వం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.126.25 కోట్లకు పెంచుతూ రూ.40.79 కోట్లను అదనంగా దోచిపెట్టింది.
కమిటీ వద్దన్నా రూ.144 కోట్ల దోపిడీ
గత చంద్రబాబు పాలనలో రూ. 430 కోట్లతో చేపట్టిన కుప్పం ఉపకాలువ పనుల్లో అదనంగా రూ. 287 కోట్ల దోపిడీకి పథకం వేశారు. దీనిపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ అదనపు చెల్లింపులు కుదరవని తెగేసి చెప్పినప్పటికీ.. సీఎం రమేష్ సంస్థ కోసం చంద్రబాబు దీనిని ప్రత్యేకంగా మంత్రిమండలి సమావేశంలో ఆమోదింపజేశారు. ఆ తర్వాత అధికారం దిగిపోయే ముందే ఒకసారి రూ. 122.75 కోట్లు, మరోసారి రూ. 21.95 కోట్లు కలిపి మొత్తం రూ. 144.7 కోట్లను అక్రమంగా కట్టబెట్టారు. ఇదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు కాంక్రీట్ లైనింగ్ పనుల్లోనూ యథేచ్ఛగా అమలు పరుస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తుండటం గమనార్హం.
లైనింగ్‌లోనూ ‘సీఎం రమేష్’ సంస్థకు రూ.40.79 కోట్ల అదనపు దోపిడీ!


