● ప్రజలకు వారానికోసారి నీళ్లు
● ప్రభుత్వానికి ముందుచూపు కరువై కష్టాలు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
నీటి సమస్య మాటేలేదు
సాక్షి, మదనపల్లె: కరువు ముదురుతున్నా ముందుచూపు లేకుండా వ్యవహరించడం..గత సీజన్‌లో అందుబాటులోకి వచ్చిన కృష్ణా జలాలను అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక లేకపోవడం..గత అనుభవాల నుంచి ప్రభ ుత్వం గుణపాఠం నేర్చుకోకపోవడం వంటి కారణాలతో మదనపల్లె పట్టణ ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందస్తు నీటి నిల్వలపై దృష్టిపెట్టని ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు ప్రజలను వెంటాడుతోంది. వర్షాల్లేక పొలాలు బీళ్లుగా మారి..భూగర్భ జలాలు అడుగంటిపోగా..పట్టణాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తీవ్ర జాప్యం చేసింది. గత సీజన్‌లో కృష్ణా జలాలు అందుబాటులో ఉన్నప్పుడే చిప్పిలి, గుంటివారిపల్లె, పుంగమ్మ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, శంకర్రాయలపేట చెరువుల ను నింపి ఉంటే ప్రస్తుత నీటి సంక్షోభం ఇంత తీవ్రంగా ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరత..నీటి వెత
మదనపల్లె మున్సిపాలిటీ ప్రజలకు కావాల్సినంత నీటి సరఫరా అందడం లేదు. పట్టణంలో మున్సిపాలిటీ 189 నీటి పథకాలు ఉన్నాయి. అందులో 120 పనిచేస్తుండగా.. 69 బోర్లు ఎండిపోయినట్లు మున్సిపల్ అధికారుల లెక్క. పట్టణంలో పర్సు జనాభా 1,59,332 మంది ఉన్నారు. ఈ జనాభాకు తగ్గట్టుగా మున్సిపల్ అధికారులు తాగునీటిని అందించలేకపోతున్నారు. భూగర్భ జలాలు అడుగండిపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు పట్టణ ప్రజల తాగునీటిపై ప్రభావం చూపించింది.
వారానికోసారి నీళ్లు
మదనపల్లె మున్సిపాలిటీలో గత వైఎస్‌ఆర్సీపీ పాలనలో రోజు మార్చి రోజు ప్రజలకు తాగునీరు అందేది. శివారు ప్రాంతాల్లో కానీ, ఏ ప్రాంతమైనా నీటి సమస్య అన్నమాట ఐదేళ్లపాటు వినబడలేదు. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. వారం రోజులకు ఒకసారి తాగునీరు అందే పరిస్థితి ఏర్పడింది.
శివారు ప్రాంతాల్లో నీటి ఘోష
మదనపల్లె పట్టణంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఘోషిస్తున్నారు. బీకే పల్లి, అనపగుట్ట, రామిరెడ్డి లేఅవుట్ వైఎస్సార్ నగర్, జగనన్న కాలనీ, చంద్రా కాలనీ, చీకలగుట్ట, రామారావు కాలనీ, విజయనగర్ కాలనీ, చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ వారం రోజులు ఎక్కువ ఒకసారి నీటినిస్తున్న ప్రాంతాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
ముందు చూపులేని సర్కార్
కృష్ణా జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పుడు చంద్రబాబు సర్కార్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యం వహించింది. గత సీజన్ లో కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవహించినప్పుడు చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం ప్రయోజనాల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో 114 చెరువులకు నీటిని అందించాలని ప్రాజెక్టు నివేదికలో ఉండగా, చంద్రబాబు నియోజకవర్గం కావడంతో అదనంగా మరో 50 చెరువులను నింపుకున్నారు. కరువు ప్రాంతమైన మదనపల్లె, తంబళ్లపల్లి, పుంగనూరు ప్రాంతాలపై తీవ్రంగా నిర్లక్ష్యం చూపించారు. మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి కోసం ఉద్దేశించిన చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు కృష్ణా నీటిని అందించాల్సి ఉన్నా ప్రభుత్వం విస్మరించింది. ఈ రెండింటిని నింపి ఉంటే ఈరోజు మదనపల్లెకు నీటి సమస్య వచేదికారు. కుప్పం చెరువులకు నీటిని తరలించేందుకు చూపించిన శ్రద్ధ మదనపల్లె ప్రజల తాగునీటి విషయంలో చంద్రబాబు చూపించలేదు. ఫలితంగా ఇప్పుడు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.
కొత్తగా పది బోర్లు: మదనపల్లె నీటి సమస్యను ఎదుర్కొనేందుకు మున్సిపల్ అధికారులు లెక్కకు మించి నిధులు ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. నెలరోజుల వ్యవధిలో పదికి పైగా బోర్లు తవ్వించారు. వాటిలో కొన్ని బోర్లు నీళ్లు లేక విఫలమయ్యాయి. కొన్నింటిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చడం లేదని తెలుస్తోంది.
ట్యాంకర్ నీటికి రూ.645: తాగునీటి సమస్య నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి ప్రతిరోజు నీటిని కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలోని ఏవీ నాయుడు కాలనీ, రామిరెడ్డి లేఅవుట్, రామారావు కాలనీ, అనపగుట్టలోని నీటి సంపులకు ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి నీటిని తరలించుకుంటున్నారు. రోజుకో 250 ట్రిప్పుల నీటిని సేకరిస్తున్నారు. రోజుకో 12.50 లక్షల లీటర్లను కొంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ట్యాంకర్ కోసం రూ.645 ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో నిధులు ఖర్చు చేయడం వల్ల మున్సిపాలిటీ ఖజానాకు లక్షల్లో గండి పడుతుంది.
● పట్టణంలో ప్రస్తుతం రోజుకు 52 లక్షల లీటర్ల నీటి కొరత ఉందని, అంగీకరించిన మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, కొన్నిచోట్ల మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నామని, సమస్య పూర్తి స్థాయి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో నివాసితులు మూడు నుండి ఐదు రోజులకు ఒకసారి పట్టుమని 10–20 బిందెలకు మించి నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగుట్ట కాలనీకి చెందిన రెడ్డప్ప, చంద్ర కాలనీకి చెందిన వైష్ణవి, అనపగుట్టకు చెందిన రాజు వంటి స్థానిక బాధితులు మాట్లాడుతూ.. బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం రోజువారీ అవసరాలకు ఒక్కో ప్రైవేట్ ట్యాంకర్‌కు రూ.600 చొప్పున చెల్లించి కొనడం ఆర్థిక భారంగా మారిందని వాపోతున్నారు.


