● సాగునీటి కోసం
రైతులు రైతుల దీనచూపు
● తాగునీటికే అని కలెక్టర్ ప్రకటన
సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువలో పరుగుపెడుతున్న కృష్ణమ్మకు పోలీసులు పహారా కాస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి శనివారం సాయంత్రం కృష్ణా జలాలను ఈ కాలువకు విడుదల చేశారు. ఈ జలాలు మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలోకి ప్రవేశించాయి. బుధవారం మధ్యాహ్నానికి మదనపల్లె రూరల్ మండలంలోని చేరనున్నాయి. గత సీజన్‌లో కృష్ణా జలాలు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి పారించారు. ప్రస్తుతం ఇప్పటి తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, చినుకు లేక ఖరీఫ్ పంటలు సాగు కాకపోవడం, పెట్టిన పంటలు ఎండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో రైతులు సాగు కోసం కృష్ణా జలాలు అందించాలని విన్నవిస్తున్నారు. లేదంటే సాగు సంక్షోభంలోకి పడుతుందని, వ్యవసాయం పడకేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పొలాల మీదుగా కృష్ణమ్మ కాలువలో పారుతుంటే మా పొలంలోకి ఎప్పుడు పారుతుందా అని ఆశగా చూస్తున్నారు. అయితే కృష్ణమ్మ కోసం ఆశలు పెట్టుకున్న రైతులు..సాగునీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి ఉంటుందని అధికార యంత్రాంగం ముందే గుర్తించింది. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా, సాగునీటికి డిమాండ్ లేకుండా చేసేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా సరిహద్దు నుంచి పుంగనూరు ఉపకాలువ పొడవునా ఆయా మండలాల సీఐలు, ఎస్సైలు, పోలీసులు కాలువ పైకి వెళ్లి పహారా కాస్తున్నారు. ఎవరైనా కాలువలో పైపులు పెట్టి నీటిని తోడినా, పొలాలకు తరలించినా తక్షణమే చర్యలు తీసుకొనేలా పోలీసులతో పాటు రెవిన్యూ, డిస్కం అధికారులు ఆయా మండలాల్లో బృందాలుగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారు.
ఇద్దరు రైతులకు కౌన్సెలింగ్
పెద్దతిప్పసముద్రం మండలం గుడ్డంపల్లిలో మంగళవారం రైతులు డి.అంజి, కె.వి.రమణలు తమ పొలాల్లో పంటలకు సాగునీటి కోసం కాలువలో పైపులు పెట్టి వీటిని తోడుతున్నారు. దీనిని గుర్తించిన అధికారుల బృందం కాలువ వద్దకు వెళ్లి వాటిని తొలగించారు. రైతులకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలా చేయవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.
తాగునీటి అవసరాలకే ..
ఇప్పుడు పుంగనూరు కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలు కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై పత్రిక ప్రకటనలు కూడా జారీ చేశారు. తాగునీటి సమస్య తీవ్రమైన దృష్ట్యా మొదట మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు చెందిన ఎస్‌ఎస్ ట్యాంకులకు నీటిని అందించాలని నిర్ణయించారు. దాంతో నీటిని ఇతర అవసరాలకు మల్లకుండా కఠిన చర్యలు చేపట్టారు. దాంతో సాగునీటికి కృష్ణమ్మ పొలాలకు రాదా అని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కురబలకోట మండలం అంగళ్లు
ఎత్తిపోతల వద్ద పోలీసుల పహారా
పీటీఎం కాలువ వద్ద రైతులకు
అధికారుల కౌన్సెలింగ్


