మదనపల్లె టౌన్ : కట్టుకున్న భార్యను కొడవలితో దారుణంగా నరికి హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు పడింది. చిత్తూరులోని ఆరవ అదనపు జిల్లా కోర్టు మహిళలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి టి.హరిత మంగళవారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చిలకవారిపల్లెకు చెందిన పడపట్ల రఘు (60) తన భార్య పడపట్ల లక్ష్మీదేవమ్మను 2023 ఆగస్టు 31న పట్టపగలు నడిరోడ్డుపై కొడవలితో దారుణంగా నరికి హత్య చేశాడు. మదనపల్లె రెండో పట్టణ పరిధిలోని బాపూజీ పార్కు సమీపంలో ఈ సంచలన హత్య అందరూ చూస్తుండగానే జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం కూడా రేపింది. ఈ ఘటనపై అప్పటి రెండో పట్టణ ఎస్‌ఐ జి.హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. రఘు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. హత్య నేరానికి జీవితకాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు వారాల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు, రెండో పట్టణ సీఐ ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్‌ఐ నాగేశ్వరరావు, ప్రభుత్వ న్యాయవాది ఎం.బాలాజీ, న్యాయస్థాన పోలీసు సిబ్బంది ఎ.మునిరాజు, టి. వెంకటరమణలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.


