● 35 ఏళ్ల ఆదర్శ ఉర్దూ విద్యా సేవలకు
దక్కిన గౌరవం
● బహుభాషా కవిగా, నాటక రచయితగా
విశిష్ట గుర్తింపు
కడప నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ ఉపాధ్యాయుడు ఎస్.అబ్దుల్ సత్తార్ ఫైజీ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1989లో లక్కిరెడ్డిపల్లెలో ఎస్జీటీగా ప్రస్థానం ప్రారంభించి, సీకే దిన్నె, రాజంపేట, మైదుకూరులలో పనిచేసి, ప్రస్తుతం మూలవంక జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూగా సేవలందిస్తున్నారు. తరగతి గది బోధనతో పాటు సాహిత్య, నాటక, సామాజిక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది.
సాహిత్య, రచనా ప్రస్థానం
సత్తార్ ఫైజీ 1996 నుండి 2026 వరకు నిరంతరాయంగా 12 ఉర్దూ, 4 తెలుగు పుస్తకాలను రచించారు. ఇందులో శ్రీసర్వరే కౌనైన్‌శ్రీ భక్తిగేయాలు, శ్రీషాహే ఉమ్మత్‌శ్రీ కవితలు, శ్రీధనక్‌శ్రీ బాలసాహిత్యం, శ్రీగుల్‌హాయే ఆఖీదత్‌శ్రీ గ్రంథాలు ప్రముఖమైనవి. బహుభాషా కవిగా 1,000కు పైగా కవిసమ్మేళనాల్లో పాల్గొని, 400 ఉర్దూ, 150 తెలుగు వ్యాసాలు రాశారు. 33 చారిత్రక, సాంఘిక హాస్య నాటకాలు రచించడంతో పాటు ఎస్సీఈఆర్టీ టెక్స్‌ట్‌బుక్ రైటర్‌గా, ఉపాధ్యాయ శిక్షణలో రీసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు.
సామాజిక బాధ్యత – పురస్కారాలు
జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడిగా, కడప బాలోత్సవం సలహాదారుగా, రాయలసీమ ఉర్దూ రైటర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 35 ఏళ్ల సేవలో 200కు పైగా సన్మానాలు అందుకున్న ఆయనను మిర్జా గాలిబ్ అవార్డు (2003), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005), ఉర్దూ అకాడమీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, సితార–ఎ–ఉర్దూ అవార్డు (2023), నేషనల్ అల్లామా ఇక్బాల్ అవార్డు (2024), ఏపీ ఉర్దూ అకాడమీ బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు (2025) వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి.


