మరపురాని మహానేత వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

మరపురాని మహానేత వైఎస్సార్‌

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

రాజన్న సేవలను స్మరించుకున్న

జిల్లా ప్రజలు

మదనపల్లెలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి

ఎంపీ మిథున్‌ రెడ్డి నివాళి

రాయచోటిలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు

జలాభిషేకం

వాల్మీకిపురం, తంబళ్లపల్లెలో అన్నదానం

సాక్షి, మదనపల్లె: దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మరపురాని మహానేత అని జిల్లా ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు స్మరించుకున్నారు. బుధవారం వైఎస్సార్‌ 17వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఆయన పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకున్నారు.

వైఎస్సార్‌ మానవీయ నేత

ప్రభుత్వ పాలనలో మానవీయతను ఆవిష్కరించిన మహానేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన మదనపల్లె తట్టివారిపల్లెలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో సాగు, తాగునీటి కోసం ఆయన చేపట్టిన ప్రాజెక్టులు రైతాంగ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, పరిశీలకులు జింక చలపతి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వి.మనూజ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మూడు ప్రాజెక్టుల నీటితో జలాభిషేకం

● రాయచోటి నియోజకవర్గంలో వైఎస్సార్‌ నిర్మించిన వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన రిజర్వాయర్ల నీటితో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో చిన్నమండ్యంలో శ్రీనివాసపురం నీటితో, గాలివీడులో వెలిగల్లు నీటితో, శెట్టిపల్లిలో ఝరికోన నీటితో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ మూడు రిజర్వాయర్లు నిర్మించడం వల్ల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు.

● పీలేరు నియోజకవవర్గం వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్దికి వైఎస్సార్‌ బాటలు వేశారని కొనియాడారు. నియోజవర్గంలోని గుర్రంకొండ, పీలేరు, కలికిరి, కలకడ, కెవిపల్లె మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి.

● పుంగనూరులో రాజన్న విగ్రహానికి మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ చైర్మన్‌ అలీమ్‌ బాషా, మైనార్టీ విభాగం రాయలసీమ ఇన్చార్జి ఫక్రుద్దీన్‌ షరీఫ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు.

● తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, పీటీఎం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి ప్రజలకు బిరియాని ప్యాకెట్లు పంపిణీ చేశారు.

● మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం, మదనపల్లెరూరల్‌, నిమ్మనపల్లె మండలాల్లో వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement