● క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించండి
● ఎల్‌నినో అధిగమించేందుకు చర్యలు
● దిశ సమావేశంలో
చైర్మన్, ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, మదనపల్లె: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవినాయుడుతో కలసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, వాటి పనితీరు, అధికారుల పర్యవేక్షణ, ప్రజలకు లభిస్తున్న ఫలితాలపై సమీక్షించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిథున్ రెడ్డికి వివిధ అంశాలను వివరించారు. వీటిని పరిశీలించిన మిథున్ రెడ్డి వివిధ అంశాలపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందినప్పుడే పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి అధికారి గుర్తించాలన్నారు. పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తేగలిగితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనికోసం జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఉపాధి పనిదినాలు తగ్గడానికి కారణాలను పరిశీలించి, పని దినాలను పెంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి పనులు, బిల్లుల సమస్యను పరిష్కరించాలన్నారు. పీలేరు, ఇతర ప్రాంతాల్లో ఖాళీ ఇళ్ల ప్లాట్లను గుర్తించి ఆక్రమణలు, అనధికార లావాదేవీలకు అవకాశం లేకుండా పరిరక్షించాలని, రెవెన్యూ అధికారులు అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావం నెలకొందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఎక్కడ నీటి సమస్య ఉన్న తక్షణమే స్పందించాలని అధికారులను సూచించారు. పాడి రైతులకు దాణా సరఫరా, పశువులకు గడ్డి, తాగునీటి సమస్యల పరిష్కారం జరగాలన్నారు. దీనికోసం తమ పరిధిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులతో మామిడి తోటలు ఎండిపోతున్నాయని వాటికి ట్యాంకర్లతో నీటిని అందించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని అధికారులను కోరారు.
పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్
ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చే భూసేకరణ, బిల్లుల చెల్లింపులు, కొత్త అనుమతులు, సీఎస్‌ఆర్ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శాఖల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని, అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలుంటామని హెచ్చరించారు.
దిశ సమావేశం అనంతరం ఆర్‌డీఎస్‌ఎస్ పథకం చైర్మన్‌గా ఎంపీ మిథున్‌రెడ్డి విద్యుత్ శాఖ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై సమీక్షించారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ప్రజా సమస్యలపై వినతులను అధికారులు సీరియస్‌గా పరిగణించి, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఎంపీ స్పష్టం చేశారు.
తాగునీటికి నిధులు ఇస్తా
దిశ సమావేశం అయ్యాక మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దారుణమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికోసం సత్వరమే చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం పశువులకు గడ్డి, దాణా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సమస్యలు అధికమవుతున్న కారణంగా నీటి కోసం తన ఎంపీ నిధుల నుంచి మెజార్టీ నిధులతోపాటు సీఎస్‌ఆర్ నిధులను తెప్పించి తాగునీటి కోసం అందిస్తానని వివరించారు.


