ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
● మీటర్లలో కోత.. మైక్రాన్లలో మాయ..
ధరల్లో భారీ తేడాలతో వ్యాపారుల దందా
● నాసిరకం పేపర్‌తో పంటలకు దెబ్బ.. ఫిర్యాదు చేస్తే
చర్యలు తీసుకుంటామన్న ఏవో
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో పంటల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్న రైతులకు మల్చింగ్ పేపర్ కొత్త సమస్యగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలుపు నివారణ, నేలలో తేమను కాపాడటం, నీటి వినియోగాన్ని తగ్గించడం, పంటల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం రైతులు మల్చింగ్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాణ్యత లేని మల్చింగ్ పేపర్‌ను రైతులకు అంటగడుతూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మైక్రాన్లలో మాయ.. నాణ్యతలో కోత!
మల్చింగ్ పేపర్ కొనుగోలు సమయంలో దాని మందం (మైక్రాన్లు), వెడల్పు, పొడవు, నాణ్యత, వినియోగ కాలం వంటి వివరాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే చాలామంది రైతులకు ఈ సాంకేతిక వివరాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అడిగిన మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పేపర్‌ను సరఫరా చేయడం, రోల్‌లో ఉండాల్సిన పొడవు కంటే తక్కువగా ఇవ్వడం, నాసిరకం మెటీరియల్‌ను మంచి నాణ్యతగా చెప్పి విక్రయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. మల్చింగ్ పేపర్‌ను సాధారణంగా రోళ్ల రూపంలో కొనుగోలు చేస్తారు. కానీ కొన్నిచోట్ల రోల్ బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తూ, వాస్తవంగా రైతుకు అందాల్సిన పొడవు, మందం విషయంలో స్పష్టత లేకుండా విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బయటకు చూస్తే రోల్ పెద్దగా కనిపించినా, పొలంలో పరచిన తర్వాత తక్కువ విస్తీర్ణానికే సరిపోవడంతో రైతులు అదనంగా మరో రోల్ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు.
తక్కువ ధర ఆశ చూపి.. నాసిరకం సరుకు!
ధర తక్కువగా ఉందనే కారణంతో కొందరు రైతులు పేపర్ కొనుగోలు చేస్తే, కొద్దిరోజులకే అది చిరిగి పోవడం, ఎండకు తట్టుకోలేక పోవడం, గాలికి ఎగిరిపోవడం వంటి సమస్యలు ఎదురవు తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మొదట చెల్లించిన డబ్బుతో పాటు తిరిగి పేపర్ కొనుగోలు, కూలీల ఖర్చు, పంట సంరక్షణ ఖర్చు పెరిగి రైతుపై అదనపు భారం పడుతోంది. కొందరు వ్యాపారులు రైతులకు సరైన బిల్లులు ఇవ్వకుండా మల్చింగ్ పేపర్ విక్రయిస్తున్నారు. బిల్లు లేకపోవడంతో నాసిరకం సరుకు విక్రయించినప్పుడు వ్యాపారిని ప్రశ్నించేందుకు రైతులకు ఆధారం లేకుండా పోతోంది. కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, మైక్రాన్ వివరాలు, పొడవు, వెడల్పు వంటి వివరాలు స్పష్టంగా లేని పేపర్‌ను కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
ఒక్కో రైతుకు వేల రూపాయల భారం
మల్చింగ్ పేపర్ కొనుగోలు కోసం రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. నాణ్యత లేని పేపర్ కారణంగా ప్రతి దశలో అదనపు ఖర్చు పెరుగుతుండటంతో చివరకు చేతికి మిగిలేది తక్కువేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్చింగ్ పేపర్ విక్రయించే దుకాణాలు, సరఫరాదారులపై సంబంధిత అధికారులు నిఘా పెట్టాలని రైతులు కోరుతున్నారు. విక్రయించే పేపర్ నాణ్యత, మైక్రాన్, పొడవు, వెడల్పు, బిల్లులు, ధరలపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన పేపర్‌ను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొనుగోలు చేసే ముందు రైతులు తప్పనిసరిగా కంపెనీ పేరు, మైక్రాన్, పొడవు, వెడల్పు, ధర, బిల్లు వంటి వివరాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బార్లపల్లె వద్ద పొలంలో మల్చింగ్ పేపర్‌తో సాగైన టమాటా మల్చింగ్ పేపర్ పరచి పంట సాగుకు సిద్ధంచేసిన ఓ రైతు
అన్నదాతను ఆదుకోవాల్సిన వ్యవస్థలోనే ఇటువంటి మోసాలు జరగడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మదనపల్లె వ్యవసాయశాఖ ఏవో నవీన్ కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. రైతుల నుంచి అక్రమాలపై ఫిర్యాదులు అందితే సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని మల్చింగ్ పేపర్లు విక్రయించే వ్యాపారులతో మీటింగ్ పెట్టి అధిక ధరలకు విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించామని తెలిపారు. ఎవరైనా రైతులను నాణ్యత లేదా తూకం విషయంలో మోసం చేస్తుంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన రైతులకు సూచించారు.


