అంబవరం వద్దా అదే అరాచకం.. గెజిట్ ఇచ్చి అభ్యంతరాలు తొక్కేశారు
రాజకీయం.. రౌడీయిజం.. రాక్షసత్వం
● పరిహారం చెల్లించకుండానే కమలాపురం, అంబవరం ఆర్‌ఓబీ పనుల్లో కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం
● ప్రశ్నించిన నిర్వాసితులపై
దాడులు, బెదిరింపులు
● పాపాఘ్నిలో యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్ మట్టి కొల్లగొడుతున్న వైనం
సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబీ) నిర్మాణం అత్యవసరమైనప్పటికీ, అభివృద్ధి పేరిట సామాన్య నిర్వాసితుల పొట్టగొట్టి ఈ నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఆక్షేపణీయం. లక్షలాది రూపాయల విలువ చేసే తమ నికర ఆస్తులను, సొంత గూళ్లను త్యాగం చేస్తున్న భూ బాధితులకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పనులు చేపట్టడం అభ్యంతరకరం. శ్రీఇదేమి అన్యాయం?్ఙ అని అడిగితే అధికార పార్టీ తెలుగు తమ్ముళ్లు ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. స్థానిక ఓ ప్రముఖ కూటమి ప్రజాప్రతినిధి అభయహస్తంతోనే కాంట్రాక్టర్లు, పచ్చ రౌడీలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ భూ నిర్వాసితులకు నిలువునా అన్యాయం చేస్తున్నారు.
రూ.39 కోట్లతో ఆర్‌ఓబీ పనుల టెండర్.. అయినా అందని సొమ్ము
నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో రైల్వే క్రాసింగ్ నంబర్–134 వద్ద రూ.39 కోట్ల వ్యయంతో ఆర్‌ఓబీ నిర్మాణానికి లక్ష్మిప్రియ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ టెండర్లను దక్కించుకుంది. భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినా బాధితులకు నష్టపరిహారం అందలేదు. బహిరంగ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతుంటే.. అధికారులు, పాలకులు పట్టించుకోకుండా వారిపై దాడులకు తెగబడుతుండటం కమలాపురంలో తీవ్ర అశాంతికి దారితీస్తోంది.
ఇంతకీ ఎవరీ ‘ట్రిపుల్ ఆర్’..?
రైల్వే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కేవలం కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో ‘ట్రిపుల్ ఆర్’ అనే సంస్థ తెరపైకి వచ్చి అడ్డగోలుగా పనులు చేపడుతోంది. ఈ సంస్థ పేరుతో ఉన్న టిప్పర్లే రాత్రింపగళ్లు పాపాఘ్ని నదిలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నాయి. అంతేకాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రావెల్ మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక ఓ ప్రముఖ కూటమి ప్రజాప్రతినిధికి ఈ సంస్థ నుండి భారీగా కమీషన్లు ముట్టజెప్పడం వల్లే, పచ్చ రౌడీలు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతూ నిర్వాసితులపై దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించిన తర్వాతే పనులు చేపట్టాలని పరిశీలకులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
కమలాపురంతో పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ వెళ్లేందుకు అంబవరం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆర్‌ఓబీ నిర్మాణాల్లోనూ కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం సాగుతోంది. సర్వే నంబర్లు 1139/2, 1140/2, 1141/1, 1179/1బి పరిధిలో రైతులు తమ విలువైన పట్టా భూములను కోల్పోతున్నారు. భూసేకరణకు సంబంధించి గెజిట్ నంబర్ 03/2025ను అప్పటి కలెక్టర్ జారీ చేశారు. కొప్పర్తి పారిశ్రామికవాడ, హైవేకు సమీపంలో ఉన్నందున కనీసం ఎకరాకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను నిర్వాసితులు లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. కాని రైతుల అభ్యర్థనలకు ఎలాంటి ప్రత్యుత్తరం రాకమునుపే కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు మొదలుపెట్టాడు. నిర్వాసితులు గగ్గోలు పెడితే, తెలుగు తమ్ముళ్లు ఓ ప్రజాప్రతినిధి పేరు చెబుతూ భయపెట్టి బలవంతంగా పనులు ప్రారంభించారు. ఇదే పరిస్థితి కమలాపురంలో కూడా తలెత్తడంతో నిర్వాసితులు అన్యాయం చేయవద్దని వాపోయారు. అలా ప్రశ్నించినందుకు పచ్చమూకలు ఏకంగా సురేష్ అనే భూనిర్వాసితుడిపై దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బలవంతంగా ఈడ్చుకెళ్లి బంధించిన దారుణ ఉదంతం కలకలం రేపింది.


