● భార్యను నరికి చంపిన కిరాతకుడు!
● పదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై వచ్చి ఘాతుకం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి దిగువపల్లికి చెందిన కె.మధుకర్ రెడ్డి (48)కి, బి.కొత్తకోట మండలం కనికలతోపు కొత్తపల్లికి చెందిన దండామణి (38)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 19 ఏళ్ల క్రితం స్వగ్రామంలో జరిగిన బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్‌రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కర్ణాటక పోలీసులకు చిక్కి పదేళ్లుగా జైలు శిక్ష అనుభవించిన ఇతను, ఈనెల ఆగస్టు 14న బెయిల్‌పై విడుదలై మదనపల్లె బాబు కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. నిందితుడి పాత నేర ప్రవర్తనపై తీవ్ర భయం ఉండటంతో దండామణి అతనితో వెళ్లేందుకు నిరాకరించింది. కాపురానికి పంపాలని అత్త, బావమరిదిపై ఒత్తిడి తెచ్చి గొడవలు చేయడమే కాకుండా, ఇటీవల దండామణి సోదరుడు వీరభద్రారెడ్డిపై దాడి చేసి చేయి విరిచాడు. కాపురానికి పంపితే చంపేస్తాడనే భయంతో కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించి పంచాయితీలు పెట్టినా వినలేదు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి, కాపురానికి ససేమిరా అన్నందుకు వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య దండామణి తల, మెడపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. పక్కనే ఉన్న తల్లి పద్మావతమ్మ వచ్చి చూసేసరికి బిడ్డ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కేకలతో స్థానికులు చేరి తమ్ముడు వీరభద్రారెడ్డికి సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన కాసేపటికే వీరభద్రారెడ్డికి మధుకర్‌రెడ్డి ఫోన్ చేసి.. ‘‘ఇంకా ఇద్దరు ఉన్నారు.. వారిని కూడా చంపి, నేనూ చనిపోతాను’’ అని సైకోలా హెచ్చరించాడు. ఘటనా స్థలానికి విచారణ కోసం వచ్చిన డీఎస్పీ బుచ్చిరాజుకు వీరభద్రారెడ్డి ఈ భయానక ఫోన్ రికార్డింగ్‌ను వినిపించాడు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన డీఎస్పీ.. నిందితుడు మరిన్ని దాడులకు తెగబడకముందే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుడు మధుకర్‌రెడ్డి పరారీలో ఉండటంతో అతని కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ విష్ణు నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


