సర్కారు స్థలం.. ఆక్రమణ పర్వం | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్థలం.. ఆక్రమణ పర్వం

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

నేషనల్‌ హైవే పక్కన కబ్జాకు

గురవుతున్న భూములు

ప్రేక్షక పాత్రలో రెవెన్యూ అధికారులు

రొంపిచెర్ల : మండల పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 36లో ప్రభుత్వ భూమి ఉంది. హైవే దగ్గర ఉన్న భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండటంతో.. ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. ఇదే భూమిని గతంలో పీలేరుకు చెందిన ఒక బడా నాయకుడు ఆక్రమించుకుంటుండగా బండకిందపల్లె వీఆర్వో సురేంద్ర, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆక్రమణదారుడు అధికారులను ఖాతారు చేయకుండా 36 సెంట్ల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్‌ వేశారు. దీంతో ఆక్రమదారుడిపై రొంపిచెర్ల పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయించారు. ఈ కేసులో నిందితుడిని ఇంత వరకు అరెస్టు చేయలేదు.

అంతేకాక అతను కనీసం ఫెన్సింగ్‌ కూడా తొలగించలేదు. అలాగే తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

కమోళ్లపల్లె నుంచి రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డు వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నా.. రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కమోళ్లపల్లె చెరువు కాలువను కూడా పూడ్చి వేసి ఆక్రమించారని రైతులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులతో లాలూచీ పడి పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 24 గంటల్లో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సర్వేయర్‌ను పంపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement