‘మినీ’ ఫిల్టర్‌.. ‘మెగా’ నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

‘మినీ’ ఫిల్టర్‌.. ‘మెగా’ నిర్లక్ష్యం!

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

పాఠశాలలో నిరుపయోగంగా వాటర్‌ ఫిల్టర్‌

తాగునీటి సమస్యతో విద్యార్థులకు ఇక్కట్లు

పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం హైస్కూల్‌లో 159 మంది విద్యార్థులు ఉన్నారు. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఈ పాఠశాల నుంచి ప్రతి ఏడాది మండల, జిల్లా స్థాయిలో సత్తా చాటే విద్యార్థులు ఒకరిద్దరు ఉంటారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నారు. అయితే మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా హైస్కూల్‌ పిల్లల సౌకర్యార్థం పూర్వ విద్యార్థులు, దాతలు గతంలో మినీ వాటర్‌ ఫిల్టర్‌ను విరాళంగా అందజేశారు. కాలక్రమేణా అది మరమ్మతులకు గురైంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభం నుంచి హైస్కూల్‌లో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో.. విద్యార్థులందరూ వారి ఇళ్ల నుంచి బాటిళ్లతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ పాలకులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాము, ఒక్కో పాఠశాలకు రూ.లక్షల నిధులు వెచ్చించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చామని ఢంకా బజాయిస్తున్నారే గానీ.. క్షేత్ర స్థాయిలో వసతులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఇక్కడే గాక మరి కొన్ని స్కూళ్లలో కూడా తాగునీటి సమస్య ఉందని పిల్లల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మినీ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement