రాయచోటి టౌన్ : ‘ఇంగ్లిష్ గ్రామర్ నేర్పించబడును’ అనే రోజుల నుంచి.. తెలుగు భాషను నేర్పించబడునని బోర్డులు ఏర్పాటు చేసే స్థాయికి విద్యావ్యవస్థలు వచ్చాయి. అవును దాదాపుగా ముప్‌పై సంవత్సరాల క్రితం 10వ తరగతి పాస్ అయిన వారికి పరీక్షలు తప్పిన వారికి ఇంగ్లిష్ గ్రామర్‌ను నేర్పించబడునని టుటోరియిల్స్ వెలిసేటివి. అలాంటి వాటి స్థానంలో మేము తెలుగు భాషను నేర్పిస్తామని, తెలుగు నేర్పడం మా ప్రత్యేకత అని బోర్డులు ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది. ఇంగ్లిష్ భాష అవసరమే. ఉన్నత చదువులు చదవాలన్నా.. మంచి ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఇంగ్లిష్ బాష అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇంగ్లిష్ బాష మోజులో పడి ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్‌లోనే పాఠ్యాంశాలు బోధన రావడం వల్ల తెలుగు భాషకు గడ్డుకాలం వచ్చింది. ప్రధానంగా తల్లిదండ్రులు చాలా మంది తమ పిల్లలకు ఇంగ్లిష్ భాషే కావాలని పనికట్టుకొని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. తెలుగు బాషలో నేర్పుతున్న పాఠ్యాంశాలపై మోజు పూర్తిగా తగ్గిపోయింది. కనీసం ఇంటికి వచ్చిన తరువాత ఇంటిలో కూడా తెలుగు భాషను మాట్లాడనీయకుండా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని పిల్లలపై వత్తిళ్లు తీసుకరావడం మరో విడ్డూరం. ఇంగ్లిష్‌లో మాట్లాడిన వారు మాత్రమే మేధావిగా చెప్పుకోడంతో పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్‌లో చదివించాలని ఎన్ని కష్టాలు ఎదురైనా తమ సంపాదన అంతా పిల్లల ఇంగ్లిష్ చదువుల కోసమేనన్నట్లు వ్యవహరిస్తున్నారు.


