రాయచోటి (చిన్నమండెం) : రాయచోటి– మదనపల్లి మార్గంలోని చిన్నమండెం మండలం వండాడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన పత్తి సుధాకర్(40) దుర్మరణం చెందాడు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చిన్నమండెం పోలీసులు చెబుతున్నారు. ఉండాలి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలభాగంతోపాటు శరీరమంతా నుజ్జునుజ్జుగా మారి గుర్తుపట్టలేని స్థితిలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం అంకమ్మనగర్‌కు చెందిన పత్తి సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు. మెడికల్ రెప్‌గా పని చేస్తున్న సుధాకర్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సుధాకర్ గుర్రంకొండ నుంచి ఏ వాహనంలో అక్కడికి వచ్చారన్న సమాచారం లేదు. కొంత మంది మాత్రం నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై చిన్నమండెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుడు రైల్వేకోడూరు వాసి


