● భర్తను అంతమొందించిన భార్య, స్నేహితులు
● హత్య కేసు నిందితుల అరెస్ట్
రాయచోటి : గాలివీడు మండల పరిధిలోని బాలకృష్ణ హత్య కేసులో గుట్టు వీడింది. నిందితులు ఆయన భార్య, ఆమె స్నేహితులేనని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన స్నేహితులతో కలిసి ఆమె అంతమొందించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసును చాకచక్యంగా ఛేదించి, నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్త బాలకృష్ణను దారుణంగా హత్య చేసిన భార్య చిన్నక్క, ఆమెకు సహకరించిన సన్నిహితుడు కడప రఫీ, నవీన్‌లను గాలివీడు పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేని ఈ కేసును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో తన పర్యవేక్షణలో దర్యాప్తు చేశారన్నారు. 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారన్నారు. కేసును ఛేదించిన సీఐ హెచ్.కృష్ణంరాజు నాయక్, ఎస్‌ఐ జె.నరసింహరెడ్డి, సీసీఎస్ ఏఎస్‌ఐ సర్దార్, కానిస్టేబుళ్లు మహేంద్ర నాయుడు, బర్కత్‌లను ఎల్‌ఆర్ పల్లి సర్కిల్ పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.


