కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది.. ఎలా బతకాలి?
బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నాం
● జిల్లాలో ఐదు వారాలుగా నిలిచిపోయిన రూ.15 కోట్ల ఉపాధి హామీ వేతనాలు
● జూలై 10 నుండి అందని బిల్లులు.. 2.94లక్షల మంది కూలీల ఇళ్లల్లో ‘ఉపాసాల’ హామీ
● పిల్లల చదువులు, డ్వాక్రా కంతుల కోసం అప్పుల ఊబిలోకి పేదలు
మదనపల్లి (కురబలకోట): రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ఉపాధి హామీ కూలీల పరిస్థితి అన్నమయ్య జిల్లాలో అత్యంత దయనీయంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని కాలంలో పేదలకు కొండంత ఆసరాగా నిలవాల్సిన జాతీయ ఉపాధి హామీ పథకం (వీబీజీ రాంజీ).. ఇప్పుడు వారికే పెను భారంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కాలమాన పరిస్థితులను, ఎండలను తట్టుకుని అహర్నిశలు కష్టపడి పని చేసినా.. సకాలంలో వేతన సొమ్ము చేతికి అందకపోవడం దారుణమని కూలీలు కన్నీరుమున్నీరవుతున్నారు.
జూలై 10 నుండి ‘పైసలు’ బంద్..
5 వారాలుగా ఉపాసాలు!
నిబంధనల ప్రకారం ఉపాధి పనులు చేసిన కూలీలకు ప్రతి 15 రోజులకు ఒకసారి వారి వేతన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ జిల్లాలో గత జూలై 10వ తేదీ నుండి ఇప్పటి వరకు ఐదు వారాలుగా కూలీలకు ఒక్క రూపాయి కూడా వేతనం విడుదల కాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు రూ.15 కోట్లకు పైగా ఉపాధి వేతనాల బకాయిలు పెండింగ్‌లో పడిపోవడంతో కూలీల ఇళ్లల్లో పూట గడవడమే గగనంగా మారింది. నిత్యావసర వస్తువులు కొనడానికి, ఇంటి ఖర్చుల కోసం కూలీలు అప్పుల బారిన పడుతున్నారు.
జిల్లాలో 2.94 లక్షల మంది కూలీలు..
పనులకు వెళ్లాలా.. వద్దా?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 25 మండలాలు, 411 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1.72 లక్షల జాబ్ కార్డులు ఉండగా, పనులు చేసే కూలీల సంఖ్య 2.94 లక్షల వరకు ఉంది. జిల్లాలో రోజుకు సగటున 25 వేల మంది కూలీలు చెరువుల పూడికతీత పనులు, కాలువ పనులు, ట్రెంచీలు, భూ అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. అయితే చేసిన పనులకే ఇంకా పైసలు రాలేదని, మళ్లీ పనులకు వెళ్తే తిండికి ఏం చేయాలని వేదన చెందుతూ చాలా ప్రాంతాల్లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మీమాంశ కారణంగా రాబోయే రోజుల్లో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడనుంది.
వర్షాభావం.. టమాటా దెబ్బ..
ప్రభుత్వాలపై మంట!
ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో వ్యవసాయ పనులు కూడా అంతగా లేవు. దీనికి తోడు జిల్లాకు ప్రధాన పంట అయిన టమాటాకు కూడా మార్కెట్లో ఆశాజనకంగా ధరలు లేకపోవడంతో ఆ రంగంలోనూ కూలి పనులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కూలీలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము పేదల సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటూనే కూలీల పొట్ట కొట్టడం దారుణమని శ్రామికులు మండిపడుతున్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం ప్రభుత్వాల అసమర్థ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.
మా కుటుంబాలకు ఉపాధిహామీ పనులే ఏకై క జీవనాధారం. జూలై మాసం నుండి రావాల్సిన కూలి డబ్బులు ఇంతవరకు రాలేదు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో మా బతుకుదెరువు కష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, డ్వాక్రా అప్పులు, వైద్య అవసరాలు, నిత్యావసర సరుకులకు కూడా ప్రతిరోజూ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నందుకు మాకు పరిహారం ఇవ్వాలి. వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలి. లేకపోతే మాలాంటి పేద కుటుంబాలు ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి.
– రమణమ్మ, ఉపాధిహామీ కూలీ, మదనపల్లి మండలం.
జిల్లాలో ఉపాధి హామీ వేతన బకాయిల నిలిచిపోయిన విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్‌లో ఉన్న రూ.15 కోట్ల బకాయిలు బ్యాంకుల్లో జమ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తికాగానే, వీలైనంత త్వరలోనే కూలీల వ్యక్తిగత ఖాతాల్లో పెండింగ్ బకాయిలన్నీ ఒకేసారి జమ కాగలవు.
– వెంకటరత్నం, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా డ్వామా కార్యాలయం, మదనపల్లి.


