పీలేరు రూరల్: ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, విద్యార్థులలో అభ్యసనాభివృద్ధిని మెరుగుపరచాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) అనురాధ కోరారు. శనివారం పీలేరులోని స్థానిక ప్రభుత్వ పాఠశాల, కోటపల్లె జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సీఆర్‌సీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, నిపుణ్ భారత్‌లపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అనంతరం జెడ్పీ బాలికల పాఠశాలలో జరుగుతున్న అంగన్‌వాడీ శిక్షణను పరిశీలించి, చిన్నారులకు ఆటపాటలతో విద్యాబోధన చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉర్దూ అకడమిక్ మానిటరింగ్ అధికారి నాదిర్షా, పరిశీలకులు ఉషామాధురి, ఎంఈవోలు బాబునాయక్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
వినికిడిలోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల
మదనపల్లి (కురబలకోట): బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా అండ్ వయో వృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి సహాయ సంచాలకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, (ఏఐ) సర్టిఫికేషన్ కోర్సుతో కూడిన బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 30 సీట్లు ఉన్నాయని అర్హత కలిగిన విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జమ్మలమడుగు: ఎల్‌నినో ప్రభావంతో వర్షపు జాడే కరువైంది. ఖరీఫ్ సీజనంతా పదును వర్షం కురిసింది లేదు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి నీరు కరువైంది. ఫలితంగా ఆయా జలాశయాల్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. మైలవరం జలాశయ నీటి సామర్థ్యం 6.5 టీఎంలు కాగా ప్రస్తుతం నీటి మ ట్టం 1.5టీఎంసీలే ఉంది. ఇక గండికోట ప్రాజెక్టు నీటి సామర్థ్యం 26కాగా ప్రస్తుతం 13టీఎంసీ వరకు ఉంది. కాగా తాగునీటి అవసరాల కోసం గండికోట జలాశయం నుంచి రెండు రోజులుగా మైలవరం, లింగాల, సర్వరాయసాగర్, వామికొండ ప్రాజెక్టులకు నీరు వదులుతున్నారు.
మహిళా సాధికారతపై
చిత్తశుద్ధి ఏదీ?
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను
ప్రశ్నించిన సుమిత్ర
మదనపల్లె టౌన్: మహిళా సాధికారతను అందించడమే లక్ష్యమని నమ్మబలికి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తున్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నాయకులు సుమిత్ర, మురళి, మాధవ్ మండిపడ్డారు. శనివారం మదనపల్లె కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సమానత్వం, సాధికారత అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు, హింస పెరిగిపోతున్నా నిందితులకు కఠిన శిక్షలు పడడం లేదన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను కనీస వేతనం కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇంకా అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. వెంటనే మహిళా సాధికారతకు చట్టబద్ధమైన హామీలు ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.


