రాయచోటి టౌన్/పెద్దతిప్పసముద్రం: ఆహార పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు.. ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. తీరా ఇక్కడికి వచ్చాక ఈ రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుండటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. ఒకవైపు పాలకు సరైన ధర కరువై, మరోవైపు పశుగ్రాసం, దాణా ఖర్చులు ఆకాశాన్నంటడంతో పాడిని నమ్ముకున్న రైతులు అప్పులపాలవుతున్నారు. మూగజీవాలను సాకలేక, నానా తంటాలు పడుతూ చివరికి వాటిని తెగనమ్ముకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు భగ్గుమంటుండటంతో.. గడ్డిపూస కూడా బంగారమైపోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వేరుశనగ ఎండి.. మేత కరువై!
ఈ ప్రాంతంలో ఖరీఫ్‌లో వేరుశనగ పంటను అధికంగా సాగు చేస్తారు. దీని ద్వారా వచ్చే వేరుశనగ కట్టె పశువులకు ప్రధాన పశుగ్రాసంగా ఉపయోగపడేది. అయితే, ఈ ఏడాది ‘ఎల్‌నినో’ ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, అసలు వేరుశనగ సాగుకే నోచుకోలేదు. దీంతో మండలంలో పశుగ్రాసం కొరత మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయింది. మేత సరిగ్గా లేకపోవడంతో మూగజీవాల డొక్కలు మాడిపోతున్నాయి. ఫలితంగా పాల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రూ.30 వేలు ఇచ్చినా దొరకని కాపర్లు
ఒకవైపు పశువుల కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగిపోగా, మరోవైపు వాటిని మేపడం పాలకులకూ భారంగా మారింది. ఒకప్పుడు పశువులను మేత కోసం తోలుకెళ్లే పశువుల కాపర్లకు ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తే సరిపోయేది. కానీ, ప్రస్తుతం రూ.30 వేలు ఇస్తామన్నా కాపర్లు దొరకడం లేదు. వర్షాభావం వల్ల ఎక్కడా పచ్చిక బయళ్లు లేకపోవడం, మేత దొరక్కపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. గత్యంతరం లేక ఒకటి, రెండు గేదెలను ఉంచుకుని, మిగిలిన వాటిని విక్రయించేస్తున్నారు.
ఆదాయం ‘సున్నా’.. ఖర్చులు ‘కొండంత’
ఒక పాడి ఆవు పోషణకు రోజుకు సగటున రూ.1,120 వరకు ఖర్చవుతుంటే, పాల ద్వారా వచ్చే ఆదాయం రూ.600 దాటడం లేదు. పగలంతా అహర్నిశలు శ్రమించి పశువులను మేపినా, సాయంత్రం వేళ కాస్త ఎండుగడ్డి వేయాలన్నా ఒక్కో కట్టకు రూ.270 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒక పూట గడ్డి ఖర్చే రూ.300 దాటుతుండగా, డైరీకి పాలు పోస్తే వచ్చే ఆదాయం మాత్రం రూ.150 నుంచి రూ.175 లోపే ఉంటోంది. సగటున ఒక ఆవు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తే, రైతుకు దక్కేది రూ.300 –.350లు మాత్రమే.
‘ఫ్యాట్’ తగ్గితే ధర గుల్లా!
ఆదాయం కోసం ఎండుగడ్డి వేయకపోతే పాలలో ఉండాల్సిన ‘ఫ్యాట్’, ‘ఎస్‌ఎన్‌ఎఫ్’ శాతాలు పూర్తిగా పడిపోతాయి. ప్రస్తుతం డైరీలలో లీటరు పాలకు రూ.30 నుండి రూ.35 వరకు ధర పలుకుతోంది. అదే ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్ తగ్గితే ఆ ధర కాస్తా రూ.20 లోపునకు పడిపోతోంది. దీనికి తోడు పశువులకు ఏ చిన్న జబ్బు చేసినా కనీస వైద్య ఖర్చులు రూ.1,000 దాటుతుండటంతో పాడి రైతు కోలుకోలేని స్థితికి చేరుకున్నాడు. స్థానికంగా గడ్డి దొరక్కపోవడంతో మోతుబరి రైతులు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి ఒక్కో ట్రాక్టర్ లోడ్‌కు రూ.20 వేల నుండి రూ.25 వేల వరకు చెల్లించి ఎండుగడ్డిని తెప్పించుకుంటున్నారు.
పదీ‘పరకా’ కోసం పశుపోషకుల పాకులాట
ఆదాయం రూ.600.. మేత ఖర్చు రూ.1,120
ఆహార పంటలు నష్టపోయి
పాడి వైపు వస్తే.. ఇక్కడా సంక్షోభమే
కర్ణాటక నుంచి రూ.25 వేలు పెట్టి ట్రాక్టర్ గడ్డి తెచ్చుకుంటున్న వైనం
గడ్డి కొరత లేదంటూనే.. ‘రోజుకు 5 కిలోలే వేయండి’ అంటున్న జిల్లా అధికారి!


