రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని చలపతి వీధిలో ఆకుల దనలక్ష్మి (55) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాయచోటి అర్బన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ధనలక్ష్మి రాయచోటి పట్టణంలోని కొత్తపేటకు వెళ్లే దారిలోని చలపతి వీధిలో సుమారు 20 ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఆమె భర్త చనిపోయారు. ఒంటరిగానే ఉంటోంది. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ శుక్రవారం రాత్రి ఇంటిలో నిద్రపోయి ఉండగా.. శనివారం ఉదయం 10 గంటలు అయినా బయటికి రాకపోవడంతో.. అదే ఇంటి మేడపైన నివాసం ఉండే వ్యక్తి కిటికీలో నుంచి చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అర్బన్ సీఐ బీవీ చలపతి తన సిబ్బందితో వెళ్లి చూడగా.. ఆమె చనిపోయి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తరువాత స్థానికులతో సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయాన్ని మృతురాలి బంధువులకు తెలియచేశామని, వారు ఆదివారం రాయచోటికి వస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
అనుమానాస్పద మరణంగా కేసు నమోదు


