జీవితం ఒక ఆల్‌జీబ్రా.. విలువ కనుగొంటే విజయమేరా ! | - | Sakshi
Sakshi News home page

జీవితం ఒక ఆల్‌జీబ్రా.. విలువ కనుగొంటే విజయమేరా !

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

లైఫ్‌ ‘లెక్క’రర్‌ !

డైలీ పేపర్‌ బాయ్‌ టు డిగ్రీ లెక్చరర్‌

కష్టాలను జయించిన ‘గణిత’ విజేత!

కృషి, పట్టుదలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌

లెక్చరర్‌గా కుంచం గణేష్‌ రెడ్డి ఎంపిక

వేంపల్లె: కఠినమైన పేదరికం, అడుగడుగునా కష్టాలు ఎదురైనా.. గుండె నిండా ఆత్మవిశ్వాసం, అచంచలమైన పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వేంపల్లె మండలం తువ్వపల్లె గ్రామానికి చెందిన కుంచం గణేష్‌ రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్ల నియామక ఫలితాలలో ఆయ న గణిత శాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. ఒకప్పుడు తెల్లవారుజామునే లేచి ఇళ్ల చుట్టూ పేపర్లు వేసిన ఒక సామాన్య ‘పేపర్‌ బాయ్‌’.. నేడు ప్రభుత్వ డిగ్రీ ప్రొఫెసర్‌గా మారి పెను సంచలనం సృష్టించాడు.

12 ఏళ్లకే తండ్రి దూరం..

గణేష్‌ రెడ్డి జీవిత ప్రయాణం ఎందరికో కన్నీళ్లు తెప్పిస్తూనే, సరికొత్త స్ఫూర్తిని ఇస్తుంది. ఆయనకు కేవలం 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి కుంచం సుబ్బారెడ్డి మరణించారు. అప్పటినుంచి ఆయన తల్లి కుమారి, నాన్నమ్మ సావిత్రమ్మ తమ రెక్కల కష్టాన్నే నమ్ముకుని గణేష్‌ను చదివించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు, తన చదువు ఖర్చుల కోసం ఆయన తెల్లవారుజామునే లేచి పేపర్‌ బాయ్‌గా పనిచేశారు.

కార్పొరేట్లకు దీటుగా సర్కారు చదువు..

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో లక్షలు కుమ్మరిస్తేనే విజయాలు దక్కుతాయని భావించే వారికి గణేష్‌ రెడ్డి ఒక సజీవ నిదర్శనం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి పీజీ వరకు అంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగింది. వేంపల్లె జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి, కడప ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. గణితంపై ఉన్న పట్టుదలతో ఎంఎస్సీ ఎంట్రన్స్‌ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి, యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఏపీఆర్‌సెట్‌–2023 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు సాధించి ప్రస్తుతం వైవీయూలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

గురువు స్ఫూర్తితో ఓపెన్‌ కేటగిరీలోనే కొలువు

కడప ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ సుబ్బయ్య తనకు ఆదర్శమని, ఆయ న అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని గణేష్‌ రెడ్డి కృతజ్ఞతతో చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల పరీక్ష రాసి, మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించారు. ఈ నోటిఫికేషన్‌లో ఉమ్మడి కడప జిల్లా నుంచి మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రభుత్వ లెక్చరర్‌గా ఎంపికై న ఏకై క వ్యక్తి గణేష్‌ కావడం విశేషం.

తల్లికి ‘విజయమే’ బహుమతి

గణేష్‌ ఈ పరీక్షకు సిద్ధమవుతున్న కీలకమైన సమయంలోనే ఆయన తల్లి కుమారి భయంకరమైన క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఒకవైపు తల్లికి జరుగుతున్న కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సల తాలూకు మానసిక వేదన, మరోవైపు పరీక్షల తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన అధైర్యపడలేదు. ‘నా తల్లి నా కోసం చేసిన త్యాగాలకు, చూపిన ప్రేమకు ఈ ప్రభుత్వ ఉద్యోగమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమతి’ అని గణేష్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తనకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.

కూడికలతో స్నేహం కూడు.. తీసివేతతో కష్టాలు తుడుచు

గుణకారంతో సంతోషాలు పెంచు.. భాగహారంతో బాధలు పంచు

సమీకరణాల చిక్కు ముడులను.. సహనంతో విప్పర తమ్ముడా

‘ఎక్స్‌’, ‘వై’ ల విలువల వెనుక.. దాగుందిరా సృష్టి మర్మం

సూత్రాలన్నీ ఒడిసి పడితే.. సులువుగా మారును జీవిత గమ్యం

అపజయాల గడప దాటితే.. విజయాల ‘గణితం’ నీదవునురా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement