స్థానిక సమరానికి సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సిద్ధం!

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ముమ్మరమైంది. 2021 జనవరిలో ఎన్నికలు జరిగాయి. సర్పంచు, వార్డు సభ్యులుగా ఎన్నికై న ప్రతినిధుల పదవీకాలం ఈ ఏడాది జనవరితో ముగిసింది. దీంతో గత ఆరు నెలలుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్యలు మొదలు కావడంతో జిల్లాలో పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలనలు ప్రారంభించారు. మరోవైపు కలెక్టర్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలపై సమీక్షించారు.

9.09 లక్షల ఓటర్లు

జిల్లాలో 411 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో 4,320 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9,09,602 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 4,62,830 మంది, పురుషులు 4,46,692 ఉంది, ఇతరులు 81 మంది ఉన్నారు. డివిజన్‌ వారీగా పరిశీలిస్తే.. మదనపల్లె డివిజన్‌లో 11 మండలాలు ఉండగా 198 పంచాయతీలు, వాటిలో 2,060 వార్డులు, పీలేరు డివిజన్లో ఎనిమిది మండలాల్లో 128 పంచాయతీలు, వాటిలో 1,296 వార్డులు, రాయచోటి డివిజన్లో ఆరు మండలాల్లో 85 పంచాయతీలు, వాటిలో 874 వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం 25 మండలాల్లో 411 పంచాయతీలు, 4,230 వార్డులు ఉన్నాయి.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది. బుధవారం దీనికి సంబంధించి మండల పరిషత్‌ అధికారులు ఆయా మండలాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల స్థితిగతులు, సౌకర్యాలు, వాటిలో చేపట్టాల్సిన పనులు, ఇతర అంశాలపై పరిశీలించారు. దీనికి సంబంధించిన స్థితిగతులను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా దృష్టికి తెచ్చారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌, జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగాా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్‌, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల పై చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఏ మేరకు ఎన్నికల సామగ్రి అవసరం, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు సూచనలు చేశారు.

ఇప్పటికే పోల్‌ కమ్యూనికేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్‌ స్టేషన్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను గడువులోగా చేయాలన్నారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను ఇతర జిల్లాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉందని, ఇందుకోసం అధికారులను పంపించి అవసరమైన సమాచారాన్ని త్వరలో అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

సమావేశంలో డీఆర్వో వెంకటేష్‌, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి అమర్నాథ్‌ రెడ్డి, మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్లు ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, రమాదేవి పాల్గొన్నారు.

జిల్లాలో 411 సర్పంచ్‌, 4,230 వార్డు పదవులు

ఎన్నికలకు చర్యలు వేగవంతం

జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement