31లోగా అప్‌లోడ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

31లోగా అప్‌లోడ్‌ చేయాలి

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

– డీఈఓ షంషుద్దీన్‌

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పొందుతున్న విద్యార్థులు రెన్యువల్‌ దరఖాస్తులను ఎన్‌ఎస్‌ పోర్టర్‌లో ఈ నెల 31లోగా అప్లోడ్‌ చేయాలని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నుంచి 2024 సంవత్సరాల్లో పరీక్షకు ఎంపికై ప్రస్తుతం హాస్టల్‌ వసతి లేని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదివే పది, ఇంటర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేసుకున్న తరువాత సదరు పాఠశాల, జూనియర్‌ కళాశాల నోడల్‌ అధికారితో ఆమోదించాలని తెలిపారు. దరఖాస్తుతోపాటు స్టడీ సర్టిఫికెట్‌, జిరాక్స్‌ కాపీలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ప్రతిభ

వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి చెందిన విద్యార్థి సీవీఎస్‌ మహేంద్ర క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు ఈనెల 17న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం పొందినట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌ ప్రకాష్‌, ఏఓ పెనుకొండ రవికుమార్‌ తెలిపారు. బుధవారం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థి మహేంద్రను వారు అభినందించారు. జాతీయ స్థాయి సర్టిఫికేషన్‌ కార్యక్రమంలో సాధించిన ఈ ఘనత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ గౌరవాన్ని, ప్రతిష్టను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. డీన్‌ అకాడమిక్స్‌ డాక్టర్‌ రమేష్‌, కై లాష్‌, కోఆర్డినేటర్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ ఎం. భాస్కరయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

కారు చీకట్లలో..

చిరుతల షికారు!

రాజంపేట : రాపూర్‌ ఘాట్‌రోడ్డులో రాత్రి వేళల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. ఒక్కోసారి గుంపులుగా రోడ్డుమీదకు వస్తున్నాయి. వీటి గాండ్రింపులతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అన్నమయ్య జిల్లా అటవీశాఖ పరిధిలో ఉన్న చిట్వేలి–రాపూర్‌ ఘాట్‌రోడ్డు దట్టమైన పెనుశిలా అభయారణ్యంలో ఉంది. నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ ఘాట్‌ గుండానే ప్రయాణిస్తారు. ఇక సిద్దవటం–బద్వేలు రహదారి రాత్రి వేళ మూసి ఉండడంతో చాలా మంది ఈ దారినే ఉపయోగిస్తున్నారు. దీంతో పగలే కాకుండా రాత్రి వేళల్లోనూ రాపూర్‌ఘాట్‌ వాహనాలతో రద్దీగా ఉంటుంది. కాగా ఇటీవల ఈ ఘాట్‌లో చిరుతల గాండ్రింపులు ఎక్కువయ్యాయి. రాత్రి వేళలో చిరుతలు రోడ్డు దాటుతుండగా, ఘాట్‌లో ప్రొటక్షన్‌ వాల్‌ గోడలపై నిలబడి ఉండడాన్ని వాహనదారులు గుర్తించారు. దీనిపై అటవీ సిబ్బందిని అడగ్గా.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తి తీర్చుకోవడానికి నీటివనరులు పుష్కలంగా ఉన్నా.. అడవి దోమలపోటుకు తట్టుకోలేకే విశాల ప్రాంతానికి వస్తున్నాయని వివరించారు. వాహనాదారులు ఘాట్‌రోడ్డు దాటే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

బీసీ భవన్‌లో రగడ

కడప రూరల్‌: కడప నగరం పాత రిమ్స్‌లో గల బీసీ భవన్‌లో రగడ జరిగింది. బుధవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య ఆధ్వర్యంలో వివిధ బీసీ సంఘాల నేతలతో బీసీ భవన్‌ అభివృద్ధి కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ బీసీ సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ భవన్‌పై ఆధిపత్యం కోసం బీసీ సంఘాల నేతల మధ్య వాదనలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సహకారంతో బీసీ భవన్‌ ఏర్పాటైంది. ఈ భవనం బీసీ సంఘాలకు చెందిన అందరిది. అభివృద్ధి కమిటీలో ఏకపక్షంగా కొందరినే పరిమితం చేయకుండా, అన్ని సంఘాలకు చోటు కల్పించాలని పలువురు బీసీ నేతలు వాదించారు. బీసీ సంఘాల నేతల వాదనలు విన్న అనంతరం, సమావేశం మరొకసారి ఏర్పాటు చేస్తామని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement