హంద్రీనీవా పనుల నాణ్యతపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా పనుల నాణ్యతపై ఆగ్రహం

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

సాక్షి, మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో జరుగుతున్న హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ పనులపై రైతు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శీలంవారి పల్లె పంచాయతీ పరిధిలోని కాలువలో చేపట్టిన కాంక్రీట్‌ నిర్మాణాలను రైతు, రైతు కూలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బి.పద్మనాభరెడ్డి, రైతులు పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని రైతులు ఆరోపిస్తూ కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మించిన కాంక్రీట్‌ లైనింగ్‌ దెబ్బతింటోందని వాటి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి, రైతులు మాట్లాడుతూ పనుల నాణ్యతపై రైతులకు అనుమానం ఉందన్నారు. కాంక్రీట్‌ పనులయ్యాక క్యూరింగ్‌ చేస్తున్నారా, నిర్మాణ సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణ ఉందా, నిర్మాణ సామగ్రి, కాంక్రీట్‌ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల మేరకు వినియోగించారా అన్న అంశాలపై అధికారులు రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనంతో రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. అనుమానాలున్న పనులను నిలిపేసి నిపుణులతో నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అవసరమైన చోట కాంక్రీట్‌ క్యూబ్‌ టెస్టులు, మెటీరియల్‌ టెస్టులు, ఇతర సాంకేతిక నాణ్యత పరీక్షలు నిర్వహించి నిర్మాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా నిర్ధారించాలని కోరారు. ఈ నిరసనలో సంఘ రైతులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

కాలువలోకి దిగి రైతుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement