● పసికందు మాయం
● కర్నాటకలో పోక్సో కేసు నమోదు
● ఆర్‌ఎంపీ ఈశ్వరమ్మ అరెస్ట్
● 2 లక్షలు ఇచ్చి బాధితులను
బెదిరించిన వైనం
● మెడికల్ ఆఫీసర్ పాత్రపై దర్యాప్తు
పుంగనూరు: వైద్యవృత్తిని దిగజార్చి, మైనర్ బాలికకు రహస్యంగా ప్రసవం చేసి పసికందును మాయం చేసిన హేయమైన సంఘటన పుంగనూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ మైనర్ బాలికను ఆమె అక్క కొడుకు మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు గత నెల 2న ఆమెను పుంగనూరుకు తీసుకువచ్చారు. ఇక్కడి ఆర్‌ఎంపీ ఈశ్వరమ్మ సాయంతో ఒక ప్రభుత్వ వైద్యాధికారికి చెందిన స్కానింగ్, సర్జికల్ సెంటర్‌లో వ్యాపారం కుదుర్చుకున్నారు. ఆపై బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా ప్రసవం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం గత నెల 5న సదరు వైద్యుడు, ఆర్‌ఎంపీ కలిసి బాధితులకు బలవంతంగా రూ.2 లక్షలు ఇచ్చి, విషయం బయటపెడితే కేసు పెడతామని బెదిరించి పసికందును లాక్కుని వారిని పంపించేశారు. బెంగళూరు వెళ్లిన బాలికకు గత నెల 7న తీవ్ర కడుపునొప్పి రావడంతో అక్కడి ఆసుపత్రికి తరలించారు. ప్రసవ వివరాలు తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుబ్రమణ్యపుర పోలీసులు క్రైమ్ నంబరు: 179/2026గా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పుంగనూరుకు వచ్చిన కర్ణాటక పోలీసులు సోమవారం రాత్రి ఆర్‌ఎంపీ ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. వైద్యాధికారి ప్రైవేట్ ఆసుపత్రి, సర్జికల్ సెంటర్‌ను పరిశీలించారు. చట్టప్రకారం మైనర్లకు ప్రసవం చేసినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, కాసులకు కక్కుర్తి పడి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. నిందితులు ఆ పసికందును భారీ లాభాలకు ఒక వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం అందడంతో, ప్రస్తుతం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని పరారైన సదరు కొనుగోలుదారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వైద్యాధికారితో పాటు అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


