మదనపల్లి (కురబలకోట) : ఎంత బాగా పప్పు చేసినా అందులో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే ఎంత ఘనంగా పీజీఆర్‌ఎస్ నిర్వహించినా ఆశించిన స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే ఫలితం ఉండదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు పీజీఆర్‌ఎస్‌కు సార్థకత కూడా ఉండదు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఆశతో వస్తున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు ఉసూరుమంటున్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీలకు చిరునామాగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో పరిష్కారాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. అర్జీలు మారవు. సమస్యలు తీరవన్నట్లుగా సాగుతోంది. ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశించడం వారు ఒత్తిడి ఉన్నవి మాత్రం పట్టించుకోవడం మిగిలిన వాటిని క్షేత్ర స్థాయిలో చర్యలు పూర్తయినట్లు నమోదు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని అసహనం వ్యక్తం అవుతోంది. సకాలంలో పరిష్కారం కాక పీజీఆర్‌ఎస్ అంటే పెదవి విరుస్తున్నారు. అదే సమస్యతో మళ్లీ అర్జీ పట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొందని నిట్టూరుస్తున్నారు. దీంతో పీజీఆర్‌ఎస్ అంటే ప్రజలకు పరేషాన్ సర్వీస్ సెంటర్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువు అర్జీలు వీటిపైనే
భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, ఆక్రమణలు, ఫెన్షన్లు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలపై పరిష్కారం కోరుతూ అర్జీలు వస్తున్నాయి. సోమవారం 348 మంది వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు ఆర్జీలు స్వీకరించారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అదికారులను ఆదేశించారు.
నేతన్నలందరికీ రూ. 25 వేలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చేనేత కుటుంబానికి నేతన్న సేవ కింద రూ.25 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం నాయకులు పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం కింద జిల్లాలో ఏడు వేల మందికి పైగా లబ్దిపొందారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ఉన్నవారికి మాత్రమే అమలు పరుస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయన్నారు. దీని వల్ల చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. అందరికీ నేతన్న సేవ అందేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలి
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం జేఏసీ పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వినతి పత్రం సమర్పించారు. సీ్త్ర శక్తి పథకం కింద గతంలో కన్నా 15 లక్షల మంది ప్రయాణికులు పెరిగినా ఒక్క బస్సు కూడా అదనంగా పెంచకుండా సిబ్బందిని కూడా నియమించకున్నా విధులు నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగా ప్రవేశ పెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చూడాలన్నారు. రానున్న కృష్ణా గోదావరి పుష్కరాలకు అదనంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. ప్రైవేటీకరణ అపోహలను తొలగించాలన్నారు.
03 టిబిపి 41సి : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన


