మదనపల్లె టౌన్ : మదనపల్లెలో సోమవారం మధ్యాహ్నం ఒంటరి మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఒకటో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అమ్మినేని వీధికి చెందిన మహిళ (22) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ యజమాని కుమారుడు ఆమెను వెంబడించాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే అతను కూడా వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై సీఐ రాజారెడ్డిని వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆలయంలో చోరీ
పీలేరు : మండలంలోని తలపుల పంచాయతీ శ్రీ ఉలవల గంగమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దుండగులు ఆలయ గేటు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వేలిముద్ర నిపుణులు ఆలయాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రెండు ముక్కుపుడకలతో పాటు 25 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు
ములకలచెరువు : ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బురకాయలకోట పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన రఘునాథ్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పానీపూరి బండి నిర్వహిస్తున్నాడు. సోమవారం పులివెందుల నుంచి బురకాయలకోటకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బురకాయలకోట విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి రొడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. వాహనం సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి చికిత్స అందించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న రూ.60 వేల నగదును వారి కుటుంబ సభ్యులకు సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, శబరి అందించి నిజాయితీని చాటుకున్నారు.


