మదనపల్లె టౌన్: గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కుమార్తె తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కొత్తఇండ్లలో ఉంటున్న జ్యోతి సోమవారం (26) తన కుమార్తె లహరి (08) ని స్కూల్‌కు పంపేందుకు సిద్ధం చేస్తుండగా గీజర్‌కు అమర్చిన గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. బాధితులను వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గీజర్లు, గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే సమయంలో లీకేజీ ఉందో లేదో పరిశీలించి, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
గంజాయి విక్రేత అరెస్టు
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న బిబబిహార్‌లోని మాధేపూరా జిల్లా అభిరంపురా తులసీపూర్ టోల చౌసా గ్రామానికి చెందిన హార్మోద్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్బన్ సీఐ బీవీ చలపతి మాట్లాడుతూ.. రాయచోటిలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ విష్ణువర్థన్, సిబ్బందితో వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని 1.100 కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. జీవనోపాధికి రాయచోటికి వచ్చి కూలీలకు గంజాయి అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదనకు అలవాటు పడ్డాడని వివరించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియచేశారు.
చికిత్స పొందుతున్న జ్యోతి, లహరి


