మదనపల్లె టౌన్ : భూమి విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని, మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం పట్నం గ్రామానికి చెందిన రాజమాణిక్యం సోమవారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. కురబలకోట మండలం సర్కారుతోపునకు చెందిన రవీంద్ర 2025 సంవత్సరంలో తనకు భూమి విక్రయిస్తానని చెప్పి రూ.3.70 లక్షల నగదు తీసుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్రను డబ్బు అడిగినందుకు అతడి అనుచరుడు సత్యారెడ్డి తనపై దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. తన ద్విచక్రవాహనాన్ని కూడా రవీంద్ర లాక్కున్నారని ఆరోపించారు. ఇప్పుడు తన అనుచరులతో కలిసి చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుడు ఎస్పీని కోరారు. ఫిర్యాదు అందుకున్న ఎస్పీ ముదివేడు పోలీసులతో మాట్లాడి రవీంద్రపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నేటి నుంచి సౌత్ జోన్ ఫుట్‌బాల్ టోర్నీ
మదనపల్లె టౌన్ : మదనపల్లె ఆరోగ్యవరంలో ఆడమ్ మెమోరియల్ సౌత్ జోన్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆగస్టు 4 నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జాంటీ, సుదర్శన్, నాషీ, రాజేష్ తెలిపారు. సోమవారం వారు వివరాలు వెల్లడిస్తూ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మొత్తం 16 ప్రముఖ జట్లు పాల్గొంటున్నాయన్నారు. లీగ్, నాకౌట్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయని, ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు.
జెడ్పీ కారుణ్య నియామకాల అక్రమాలపై కేసు
కడప అర్బన్:కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 15 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించిన వ్యవహారంపై కేసు నమోదైంది. జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు మస్తాన్ వల్లీతో పాటు మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన 15 మందిలో ఇద్దరు ప్రస్తుతం జెడ్పీ సీఈవో కార్యాలయంలోనే పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ వ్యవహారంతో సంబంధమున్న మరికొంతమందిని విచారించి బాధ్యులైన అందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు మండలం శివపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(50) చికిత్స పొందుతూ మృతి చెందాడు. బళ్లారి– కృష్ణపట్నం జాతీయ రహదారి బైపాస్‌పై పొట్టేలు అడ్డం రావడంతో బైక్‌పై నుంచి కిందపడిన విషయం తెలిసిందే. సంఘటనపై మృతుడి బావమరిది గోపవరం మండలం కాలువపల్లెకు చెందిన షేక్ ఖాజావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు.


