● శ్రీ కలికిరి ఎల్లమ్మ సర్వదర్శనానికి
పోటెత్తిన భక్తజనం
● రమణీయంగా విద్యుత్ చాందినీ బండ్ల
ప్రదక్షిణలు
● రాత్రి లంకాదహనం
● మూకాంబికా దేవి రూపంలో దివ్య విహారం
కలికిరి: ‘కోరిన కోర్కెలు తీర్చే మా చల్లని తల్లీ.. ఎల్లమ్మా దీవించమ్మా’ అంటూ భక్తకోటి కీర్తనలతో కలికిరి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక జైత్రయాత్రను తలపించింది. ప్రసిద్ధ శ్రీ కలికిరి ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం క్షేత్రమంతా భక్తుల జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, విశేష అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. నయనానందకరం.. చాందినీ బండ్ల ప్రదక్షిణలు జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన చాందినీ బండ్ల ఊరేగింపు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వైభవంగా సాగింది. కలికిరి మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన చాందినీ బండ్లు వినూత్న హంగులు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆలయ ప్రదక్షిణలు చేశాయి. చాందినీ బండ్ల ముందు భక్తులు లయబద్ధంగా చేసిన పిల్లనగ్రోవి వాయిద్యాలు, కోలాటాలు, సాంప్రదాయ చెక్క భజనలు భక్తజనాన్ని మైమరపించాయి. జాతర మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఆలయం వద్ద బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి 7.30 గంటలకు ఆలయ ఆవరణలో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ‘లంకాదహనం’ ఘట్టం భక్తులను విశేషంగా అలరించింది.
మూకాంబికగా పుష్పపల్లకీ సేవ..
పురవీధుల్లో దివ్య విహారం
సోమవారం రాత్రి అమ్మవారు జగన్మాత ‘శ్రీ మూకాంబికా దేవి’ అవతారంలో నయనమనోహరంగా అలంకరించిన పుష్పపల్లకీపై అధిష్టించి, భక్తకోటి నడుమ పురవీధులలో దివ్య విహారం చేశారు. ఆలయం నుంచి వైభవంగా ప్రారంభమైన ఈ పుష్పపల్లకీ వాహన సేవ ఆర్‌ఎస్ రోడ్డు, బ్రాహ్మణ వీధి, మెయిన్ రోడ్డు, రైల్వే బ్రిడ్జి వరకు సాగి.. తిరిగి ఆలయానికి చేరుకుంది. పురవీధుల్లో అమ్మవారు విహరిస్తున్న వేళ ఇంటింటి వద్ద భక్తులు కర్పూర హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు, ఫలహారాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జగన్మాత కరుణాకటాక్షాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దివ్య మహోత్సవంలో ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్‌కుమార్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, యోగేష్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.


