ఇన్‌చార్జీల జాతర..
సాక్షి, మదనపల్లె : జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. మార్కెట్ యార్డుల సమర్థవంతమైన నిర్వహణలో, రైతులకు అండగా నిలవడంలో కీలక పాత్ర పోషించాల్సిన కమిటీ కార్యదర్శుల పోస్టులు దశాబ్దాలుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి జిల్లాలోని ప్రధాన మార్కెట్లన్నీ ఇన్‌చార్జీల పాలనలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లె యార్డుకు పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారే ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు పుంగనూరు మార్కెట్ కార్యదర్శిగా కూడా ఏడీ స్థాయి అధికారే ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడం, బదిలీ భయాలు, స్థానిక రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఇన్‌చార్జ్ అధికారులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ చేతులెత్తేస్తున్నారు.
మదనపల్లె అంటేనే హడల్!
మార్కెటింగ్ శాఖలో మదనపల్లె పోస్టింగ్ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. ఇక్కడి వ్యాపారుల సిండికేట్ దందా, అక్రమాలు, రాజకీయ జోక్యాన్ని తట్టుకో లేక ఏ అధికారీ ఇక్కడ రెగ్యులర్ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల పర్యవేక్షణ, మార్కెట్‌లో ధరల పరిస్థితుల నియంత్రణ, రైతులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమవుతు న్నారు. పంట ఉత్పత్తులకు ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవడంలో, వ్యాపారుల చేతిలో అన్నదాతలు మోసపోకుండా చూడటంలో ఇన్‌చార్జ్ పాలన శాపంగా మారింది. ఏటా మార్కెట్ పరిధి పెరుగుతున్నా, పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో మార్కె ట్ యార్డుల ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
ఇన్‌చార్జీల జాతర.. ఉన్నతాధికారుల ’రివర్స్’ పాలన
సాధారణంగా ఉన్నతాధికారులు అదే స్థాయిలోని పదవులు, లేదంటే ఆపై స్థాయి పోస్టులకు ఇన్‌చార్జిలుగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. కానీ మార్కెటింగ్ శాఖలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ’రివర్స్’ పాలన సాగుతోంది. పుంగనూరు కమిటీకి ఇన్‌చార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్న గోపి మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. ఈయన జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించాల్సి ఉండగా కేవలం ఒక మార్కెట్ కమిటీకే పరిమితం చేశారు. అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న త్యాగరాజును ఇప్పుడు మదనపల్లె మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించారు. ఈయనకు జిల్లా బాధ్యతలతో పాటు మదనపల్లె కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగించారు. దాంతో ఆయన ఎక్కువ సమయం మదనపల్లె మార్కెట్లోనే ఉంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా జిల్లా స్థాయిలో మార్కెట్ల పర్యవేక్షణ తీవ్రంగా దెబ్బతింటోంది. రాయచోటి మార్కెట్ కార్యదర్శి గత జూన్ నుంచి, కలికిరి మార్కెట్ కార్యదర్శి చాన్నాళ్లుగా ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ, వాల్మీకిపురం మార్కెట్ యార్డ్ కార్యదర్శి పరిస్థితి కూడా ఇదే! 2024 నుంచి పీలేరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇన్‌చార్జ్ పాలనలో ఉంది. జిల్లా మొత్తంలో కేవలం సోమల, బి.కొత్తకోట, ములకలచెరువు మార్కెట్లకు మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులు కొనసాగుతున్నారు.
‘సాక్షి’ కథనంతో వెల్లడైన అసలు రంగు!
మదనపల్లె మార్కెట్‌కు ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఎవరు వచ్చినా రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వినకపోతే, వారు కేవలం ఇన్‌చార్జ్‌లు మాత్రమేనన్న చులకన భావంతో పైస్థాయి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రాత్రికి రాత్రే బది లీలు చేయిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో, ఇన్‌చార్జ్ అధికారులు కూడా ‘ఉన్నన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాం‘ అనే నిర్లిప్త ధోరణితో, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జ్ పాలన వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులు ఉంటాయనడానికి మార్కెట్‌లో తాజాగా చోటుచేసుకున్న టమాట ధరల పతనమే ఉదాహరణ. ప్రస్తుతం ఇన్‌చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఏడీ త్యాగరాజు పర్యవేక్షణ లోపంపై ఇటీవల ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన టమాట ధరల పతనం కథనం సంచలనం సృష్టించింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్‌పై ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ‘సాక్షిలో వార్త వచ్చేవరకు క్షేత్రస్థాయి పరిస్థితులు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? మార్కె ట్లో ధరలు పడిపోవడానికి ఎందుకు అడ్డుకట్ట వేయలేదు?‘ అంటూ ఉన్నతాధికారులు సదరు ఇన్‌చార్జ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివాట్లు పెట్టారు. ధరలు పతనమైనప్పుడు ముందస్తు చర్యలను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఈ ఒక్క సంఘటనే జిల్లాలో ఇన్‌చార్జీల పాలన ఎంత దారుణంగా ఉందో, వారు రాజకీయ ఒత్తిళ్లకు ఎలా బలి అవుతున్నారో తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో రెగ్యులర్ కార్యదర్శులను నియమించాల్సిన అవసరం ఉంది.
మార్కెట్ కమిటీలకు రెగ్యులర్ కార్యదర్శుల నియామకంపై సర్కార్ ఘోర నిర్లక్ష్యం
ఆసియాలోనే అతిపెద్ద టమోటా యార్డు మదనపల్లెకు ఇన్‌చార్జీలే దిక్కు
జిల్లా మొత్తంలో కేవలం మూడు చోట్లే పూర్తిస్థాయి అధికారులు


