రాజంపేట: రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద గూటిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి.. అందరిలాగే నవ్వుతూ, ఆడుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ, విధి ఆ కనుపాపపై కనికరం చూపలేదు. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ‘బ్రెయిన్ క్యాన్సర్’ ఆ పసి ప్రాణాన్ని కబళిస్తోంది. రాజంపేట పట్టణం నూనివారిపల్లెకు చెందిన కొత్త ఎల్లమ్మ, రాజా దంపతుల రెండో కుమారుడు కె.పవన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గడిచిన ఆరు నెలలుగా ఆ చిన్నారి శరీరంపై వరుసగా జరిగిన శస్త్రచికిత్సలు ఆ పేద తల్లిదండ్రుల గుండెలను పిండేస్తున్నాయి.
మాట పడిపోయింది..
గాలి పీల్చడమూ నరకమే!
క్యాన్సర్ మహమ్మారి తీవ్రత వల్ల పవన్‌కు కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. కనీసం నోరు తెరిచి అమ్మా అని పిలిచే భాగ్యానికి కూడా ఆ బాలుడు దూరమయ్యాడు. కంటిముందే కొడుకు జీవచ్ఛవంలా మారుతుంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. కనీసం శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో.. వైద్యులు గొంతు భాగంలో ఆపరేషన్ చేసి, అక్కడ అమర్చిన పైపు ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆ పసి ప్రాణం నిలవాలంటే ప్రతిరోజూ ఏకంగా 26 మాత్రలు మింగాల్సి వస్తోంది.
మనసున్న దాతలు సహకరించండి
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి పవన్‌ను కాపాడుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోన్‌పే / గూగుల్‌పే నంబరు: 8886350998 (బ్యాంక్ ఖాతాదారు పేరు: కె.ఎల్లమ్మ, అకౌంట్ నంబరు: 602010016830975, ఐఎఫ్‌ఎస్సీ కోడ్: UBIN0 CG7999, బ్యాంక్ పేరు: ఏపీజీబీ, పొందలూరు శాఖ)కు డబ్బు పంపించాలని కోరుతున్నారు.
ఆరునెలలుగా నరకయాతన
కాళ్లు, చేతులు పడిపోయి చిన్నారి విలవిల
గొంతుకు ఆపరేషన్ చేసి ఆక్సిజన్ సరఫరా
రోజుకు 26 మాత్రలు మింగాల్సిన దుస్థితి
మందులకూ డబ్బుల్లేక
దాతల సాయం కోసం ఎదురుచూపు


