మూడు నక్షత్రాలు..
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఆయన భుజాలపై మూడు నక్షత్రాలు మోస్తున్న ఉన్నతాధికారి. నేషనల్ హైవే రహదారిలో జిల్లా కేంద్రానికి ప్రక్కనే ఉన్న అత్యంత సున్నితమైన మండలంలో బాధ్యతాయుతమైన సీటులో ఉన్నారు. నిబద్ధతతో పనిచేస్తూ అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నంగా మారాల్సిన ఆ పోలీసు అధికారి.. వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించే కడప సబ్‌డివిజన్ పరిధిలోనే ఈ ‘ఖతర్నాక్’ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
తెలుగుతమ్ముళ్ల నీడలో బెట్టింగ్, మట్కాల జాతర
సదరు మండల పరిధిలో గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా ఈ త్రిబుల్ స్టార్ అధికారి కనుసన్నుల్లోనే నడుస్తోంది. బెట్టింగ్ రాయుళ్లంతా అధికార కూటమికి చెందిన ’తెలుగుతమ్ముళ్లు’ కావడంతో వారిపై ఎలాంటి చర్యలూ లేవు సరికదా, సదరు అధికారికి వారే సకల మర్యాదలు చేస్తున్నారు. ఇటీవల పొరుగు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సదరు పోలీసు అధికారి ఏకంగా ఒక బెట్టింగ్ రాయుడి లగ్జరీ వాహనాన్ని వాడటం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న సదరు బుకీలు ఇటీవల జిల్లా కేంద్రంలోని తాలుకా పోలీసులకు పట్టుబడటం ఇక్కడి అధికారి లాలూచీని తేటతెల్లం చేస్తోంది.
పెన్నా ఇసుక దోపిడీపై పక్షం రోజుల ఒప్పందం
పెన్నానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం నుంచి సాగే ఇసుక అక్రమ రవాణా సదరు అధికారికి భారీ ఆదాయ వనరుగా మారింది. ఇసుక తరలించే వాహనాల నుంచి రోజువారీ కప్పం వసూలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 15 ట్రాక్టర్ల ఇసుక దందాకు సంబంధించి, ఒక్కో ట్రాక్టర్‌కు రూ.4 వేల చొప్పున పక్షం రోజులకు రూ.60 వేల ముడుపుల ఒప్పందం కుదిరింది. ఈ లావాదేవీలను ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు దగ్గరుండి నడిపిస్తూ, ’సందట్లో సడేమియా’ అన్నట్లుగా తాము కూడా కొంత సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక నగదు లేని ఇసుక వ్యాపారుల కోసం లంచం డబ్బును నేరుగా తన జీపు డ్రైవర్ మొబైల్ నంబర్‌కు ’ఫోన్‌పే’ చేయిస్తుండటం గమనార్హం. ఎవరైనా నిరాకరిస్తే అక్రమ కేసులతో నరకం చూపిస్తున్నారు.
కేసులు.. రాజీ సెటిల్‌మెంట్లే ప్రధాన దందా
అసాంఘిక శక్తులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న పోలీసు అధికారి
కూటమి నాయకుల నీడలో క్రికెట్ బెట్టింగ్, మట్కాల జాతర
కేసులు నమోదు చేయడం.. ఆపై రాజీ పేరిట దండుకోవడం నిత్యకృత్యం
పెన్నా ఇసుక దోపిడీపై రెండు రోజుల క్రితమే ’పక్షం రోజుల’ ఒప్పందం
లంచం డబ్బులు డ్రైవర్‌కు ‘ఫోన్‌పే’
లావాదేవీలు నడుపుతున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు
ఉన్నతాధికారులు కట్టడి చేయాలని స్థానికుల డిమాండ్!
స్టేషన్ మొత్తం తన హుకుం ప్రకారమే నడవాలంటూ ఈ అధికారి ఏకపక్ష చర్యలకు దిగుతున్నారు. కేసులు నమోదు చేయడం, ఆపై రాజీ ప్రయత్నాల పేరిట ఇరువర్గాల నుంచి దండుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైంది. ఇటీవల ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసి, అందులో ఉన్నతాధికారుల పేర్లు చెప్పి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. ఆపై తానే లోక్‌అదాలత్‌లో కేసు పెట్టి కొట్టివేయిస్తానంటూ నిందితులకు హామీలు ఇస్తున్నారు. ఈ ఏకపక్ష వైఖరి వల్ల విపక్ష పార్టీల వారు న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉన్న ఆ త్రిబుల్‌స్టార్ అధికారి చట్టవ్యతిరేక చర్యలను ఉన్నతాధికారులు తక్షణమే కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.


