కురబలకోట పట్టాలపై సీతామాలక్ష్మి జ్ఞాపకాలు | - | Sakshi
Sakshi News home page

కురబలకోట పట్టాలపై సీతామాలక్ష్మి జ్ఞాపకాలు

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

కురబలకోట : కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రత్యేకతలకు గుర్తుగా నిలుస్తాయి. కురబలకోట రైల్వేస్టేషన్‌ కూడా సీతామాలక్ష్మి సినిమాను గుర్తుకు తెస్తుంది. సాధారణంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే కేంద్రాలుగా రైల్వేస్టేషన్లు ఉంటాయి. కానీ కురబలకోట రైల్వేస్టేషన్‌ మాత్రం సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1978 జూలై 27న ఉమ్మడి ఏపీ అంతటా విడుదలైన సీతామాలక్ష్మి చిత్రం విజయ ఢంకా మోగించింది. చిన్న సినిమాగా విడుదలపై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రధానంగా ఈ సినిమాను కురబలకోట రైల్వేస్టేషన్‌, తెట్టు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. కళాతపస్వి కె. విశ్వనాఽథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు చిన్నస్టేషన్‌గా పెద్దగా గుర్తింపు లేని ఈ స్టేషన్‌ ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజల దృష్టిని ఆకర్శించింది. భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాలో ఈ ప్రాంత అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు. చంద్రమోహన్‌, తాళ్లూరి రామేశ్వరి జంటగా నటించిన ఈ చిత్రంలో వినసొంపైన పాటలతో అంతకు మంచి కథ, కథనంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో కురబలకోట రైల్వేస్టేషన్‌న్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మావి చిగురు తినగానే కోయిల పలికేనా..అనే పాటను ఇక్కడే తీశారు. ఆ రోజుల్లో సినిమా షూటింగ్‌ అంటే ఊర్లకు ఊర్లే తరలివచ్చేవి. ఆసక్తిగా చూసేవారు. ఆ తర్వాత ఈ సినిమాను తమిళం, హిందీలో కూడా తీశారు. దీంతో కురబలకోట స్టేషన్‌ గుర్తుకు వస్తే పరిసర ప్రాంతాల వారికి సీతామాలక్ష్మి సినిమా స్పురణకు వస్తుంది. దీనిని సీతామాలక్ష్మి స్టేషన్‌గానే సరదాగా పిలుచుకుంటారు. ఇప్పటికీ ఈ స్టేషన్‌ను చూస్తే మధ్య, పాతతరం వారికి ఆ సినిమా జ్ణాపకాలు గుర్తుకువస్తాయి. అప్పటి స్టేషన్‌ స్థానంలో కొత్తగా స్టేషన్‌ నిర్మించినా ఈ స్టేషన్‌ పేరు వినగానే సినీ అభిమానులకు సీతామాలక్ష్మి పేరు మాత్రం మనసుల్లో మెదలుతూనే ఉంటుంది. అంతేకాదు సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం అనే పాట కూడా గుర్తుకువస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement